Anganwadi Balamrutham : అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారం మెనూలో మార్పులు చేయాలని మహిళా శిశుసంక్షేమ శాఖ నిర్ణయించింది. చక్కెర స్థాయిలను తగ్గించి దాని స్థానంలో ఇతర పదార్థాలను జోడించాలని ప్రాథమికంగా నిర్ణంయించగా తయారీ బాధ్యతలు 'అక్షయ పాత్ర'కు అప్పగించనున్నారు. ఇక టెట్రా ప్యాకెట్లకు బదులు పాలపొడి సరఫరా చేయాలని భావిస్తున్న అధికారులు ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం రాష్ట్రవ్యాప్త అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.
'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'
![anganwadi_balamrutham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23541739_anganwadi_balamrutham.jpg)
అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే అనుబంధ పోషకాహారంలో మార్పుల దిశగా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. మరిన్ని పోషకాలతో అందించేందుకు కసరత్తు ప్రారంభించి ముందుగా బాలామృతం, పాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. టెట్రా పాల ప్యాకెట్లకు బదులు పాలపొడి అందించాలని నిర్ణయించారు. ఇక బాలామృతంలోనూ పోషకాలు జోడించి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించి మార్పులు చేసిన బాలామృతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అమల్లోకి తెచ్చారు. మెనూలో మార్పులు, చేర్పులపై చిన్నారులు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తీసుకోని నెలరోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
బాలామృతంలో పోషకాలు పెంచే బాధ్యత అక్షయపాత్రకు
- 6 నెలల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులకు ప్రతి నెలా రెండున్నర కిలోల ప్యాకెట్ బాలామృతాన్ని అందిస్తున్నారు.
- బాలామృతంలో పోషకాలు పెంచేందుకు చేయాల్సిన మార్పులపై UNICEF, ఎన్‌ఐఎన్, సీఎఫ్‌టీఆర్‌ఐ, టాటా ట్రస్ట్, మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధుల బృందంతో కమిటీని ఏర్పాటుచేసి పలు దఫాలుగా చర్చించారు.
- ప్రస్తుతం బాలామృతంలో చక్కెర శాతాన్ని తగ్గించి, పోషకాలు పెంచేందుకు పెసరపప్పు, గోధుమ, ఇతర పదార్థాల మిశ్రమాన్ని కలపాలని నిర్ణయించగా మార్పులు చేసే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారు.
- కొత్త బాలామృతాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ల పరిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు.
- మార్పులు, చేర్పులపై చిన్నారులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు.
గిరిజన ప్రాంతాల్లో త్వరలోనే అమలు
- అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు సహా పోషకాహారం అందిస్తున్నారు.
- లీటర్ టెట్రా పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా అరలీటరువి అంతకంటే తక్కువ నాణ్యత ఉండే ప్యాకెట్లలో సరఫరా అవుతున్నాయి.
- రోజుకు 200 మి.లీ. చొప్పున లీటర్ పాలను ఐదురోజులు వినియోగించాల్సి ఉండగా ప్యాకెట్‌ను తెరిస్తే పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదు. ఈ నేపథ్యంలో టెట్రా ప్యాకెట్లకు బదులు పాలపొడి ఇస్తే మేలని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, అనంతగిరి అంగన్‌వాడీ ప్రాజెక్టులతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పాచిపెంట ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాల్లో వారం రోజుల్లో అమల్లోకి వచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఏపీడీడీసీఎఫ్‌కు పాలపొడి సరఫరా ఆర్డర్ ఇచ్చారు.
బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్‌గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ'
పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!