AP BUDGET 2025: కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలిసారి ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూనే మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన అంశాలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలతో బడ్జెట్ రూపకల్పన పూర్తికావొచ్చింది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28వ తేదీన ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఇప్పటి వరకూ 28 శాఖల సమీక్షలను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రీ-బడ్జెటరీ సమావేశాలు నిర్విరామంగా చేపట్టారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో సాగిన వరుస భేటీల్లో తమతమ శాఖలకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆర్ధిక మంత్రికి సమర్పించారు.
ఆయా శాఖలు ఇచ్చిన ముఖ్యమైన బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు పయ్యావుల సూచించారు. విద్యా, వైద్యారోగ్య శాఖల్లో కేంద్రం నుంచి నిధుల లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అంశాన్ని ఆర్ధిక శాఖ పరిశీలిస్తోంది. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా బడ్జెట్ కసరత్తులు చేపడుతున్నారు. ఖర్చు పెట్టిన కేంద్ర నిధులకు యూసీల జారీ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని మంత్రి పయ్యావుల అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకునేలా కేంద్ర బడ్జెట్ట్‌ను అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
ఆర్థిక శాఖ ముందు మంత్రి నారాయణ ప్రతిపాదనలు: ఇప్పటికే దేవాదాయ, క్రీడలు, వ్యవసాయ, పంచాయతీ రాజ్, కాలుష్య నియంత్రణ, సెర్ఫ్, ఎంఎస్ఎమ్ఈ, మున్సిపల్, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గృహానిర్మాణం, ఐ అండ్ పీఆర్, ఇంధన శాఖలతో పయ్యావుల వరుస సమీక్షలు నిర్వహించారు. మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలకు సంబంధించి మంత్రి నారాయణ ఆర్థిక శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచారు. అమరావతితో పాటు పట్టణాల అభివృద్ధికి సంబంధించిన కీలక శాఖ కావడంతో కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు కేటాయింపుల పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి రవి పయ్యావులను కోరారు. విద్యుత్ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించిన కేటాయింపుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులకు అందజేశారు. మేనిఫెస్టో హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేటాయింపులు జరగాలని మంత్రి గొట్టిపాటి కోరారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన రీసర్వే ఇతర ప్రాజెక్టుల కోసం కేటాయింపులు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ కోరింది.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. నేడు (శుక్రవారం) పరిశ్రమలు, హోం, పౌరసరఫరాల శాఖల మంత్రులతో పయ్యావుల సమావేశం కానున్నారు. తమ తమ శాఖల కేటాయింపులపై టీజీ భరత్, అనిత, నాదెండ్ల మనోహర్‌లు ఆర్థిక మంత్రికి ప్రతిపాదనలు అందజేయనున్నారు.
ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు - బడ్జెట్‌పై చంద్రబాబు చర్చ
పూర్తిస్థాయి బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - శాఖల వారీగా సమీక్షలు