CM Chandrababu Naidu About Acid Attack Issue : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో జరిగిన యాసిడ్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనిత, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలకు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
యాసిడ్ దాడి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతోనూ మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు.
విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్
మంత్రి లోకేశ్ సైతం ఘటనపై స్పందించారు. యవతిపై యాసిడ్ దాడి తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు.
యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేశారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఆమెను తన సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తానాని భరోసా ఇచ్చారు. అధైర్య పడొద్దని, మీ వెంట తానున్నానని మంత్రి భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌తో మాట్లాడిన లోకేశ్ యువతి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెరుగైన వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.