SUMMER HEALTH DRINKS : ఎండాకాలం వచ్చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. మరో ఐదారు డిగ్రీలు పెరిగితే అడుగు బయటకు పెట్టే పరిస్థితి ఉండదు. చలికాలంలో కాస్త రిలాక్స్ కోసం టీ, కాఫీ తీసుకోవడం సహజమే. ఎండాకాలంలో ఉపశమనం ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీ బదులు పళ్ల రసాలు, పానీయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
పిల్లలకు రోజూ జ్యూస్ ఇవ్వడం మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!
![summer_health_drinks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23542685_summer_health_drinks-5.jpg)
ఎండాకాలంలో ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది. చిన్న చిన్న పనులకే నీరసపడిపోతుంటాం. అలవాటు ఉన్న వాళ్లు అలసట బారి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీ తీసుకుంటారు. కానీ వేసవిలో వేడి పదార్థాలు పెద్దగా రుచించవు. కాస్త చల్లచల్లగా ఏవైనా పళ్లరసాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే మంచిదని, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, అలసట దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండు షేక్
కాలంతో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం ఖనిజ ధాతువులు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండేందుకు అరటిపళ్లు సహకరిస్తాయి. ఉదయం పూట అరటిపళ్లు తినడం వల్ల ఆరోజుకు సరిపడా పోషకాలను పొందే వీలున్నా నేరుగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు. నేరుగా తీసుకుంటే కొద్ది మందికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిదని సూచిస్తున్నారు.
![summer_health_drinks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23542685_summer_health_drinks-6.jpg)
హోంమేడ్ హెర్బల్ టీ
వీధి చివర దుకాణాల్లో బోలెడన్ని హెర్బల్ 'టీ'లు రకరకాల ప్లేవర్స్‌లో దొరుకుతున్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువే ఉంటున్నాయి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే హెర్బల్ టీ తయారు చేసుకొని తాగడం మంచిది. తయారీ పెద్ద కష్టమేమీ కాదు. పైగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. చిన్న పాత్రలో నీటిని వేడి చేసి సరిపడా గ్రీన్ టీ ఆకులు వేసి, సువాసన కోసం కొంచెం యాలకులు, అల్లంవేసి మరిగించాలి. నీళ్లు రంగు మారిన తర్వాత గ్లాసులోకి వడపోసుకుని తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఎంతో బాగుంటుంది. ఉదయం లేవగానే తర్వాత ఓ కప్పు హెర్బల్ టీ తాగితే వాటిల్లోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రి నిద్ర పోయే ముందు కూడా హెర్బల్ టీ తీసుకుంటే దీర్ఘకాలిక అలసట సమస్యలను అదుపు చేయవచ్చు.
దానిమ్మ రసం
విటమిన్ల భండాగారం దానిమ్మ. ఈ పండ్లలో C, K, E విటమిన్లు అధికంగా ఉంటాయి. మాంగనీస్, ఐరన్, భాస్వరం, పొటాషియం, జింక్ ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. రక్తపోటు తక్కువగా ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు రోజూ దానిమ్మ రసం తీసుకుంటే వారి శక్తి పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్‌లో కొంచెం ఒక చెక్క నిమ్మరసం పిండుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయి. నిమ్మ రసంలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల దానిమ్మలోని ఐరన్ ధాతువులను గ్రహించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్తంలో ఐరన్ స్థాయి తగ్గితే అలసట ఎక్కువగా ఉంటుంది.
![summer_health_drinks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23542685_summer_health_drinks-3.jpg)
పుచ్చకాయ, సబ్జా గింజలు
వేసవిలో పుచ్చకాయలు విరివిగా లభిస్తుంటాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఎండ వల్ల అలసటగా అనిపించినప్పుడు రెండు, మూడు పుచ్చకాయ ముక్కలు తిన్నా ఎంతో హాయిగా అనిపిస్తుంది. పుచ్చకాయ రసంలో కొన్ని సబ్జా గింజలు వేసి తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అలసట నుంచి ఉపశమనం పొందడంతో పాటు శరీర అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సబ్జా కీలక పాత్ర పోషిస్తుంది. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎండ తాకిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. షుగర్ పెరగకుండా పీచు పదార్థాలు నిదానంగా జీర్ణమవుతాయి. మధుమేహంతో బాధపడుతున్న వారు పుచ్చకాయ, సబ్జా గింజల జ్యూస్ తీసుకోవడం వరం అనే చెప్పొచ్చు. సబ్జాగింజల్లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కవగా ఉండడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
![summer_health_drinks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23542685_summer_health_drinks-2.jpg)
కొబ్బరి నీళ్లు
వేసవి దాహార్తి తీర్చుకోవడంలో చాలా మంది కొబ్బరి నీళ్లకే మొగ్గు చూపుతారు. ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరాన్ని నాజూగ్గా ఉంచడంలో సహకరిస్తాయి. బాగా అలసటగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లలో నిమ్మరసం, తేనె, పుదీనా లేదా కొత్తిమీర, సబ్జా గింజలు వేసుకుని తాగితే చాలు. నోటికి రుచిగా ఉండడంతో పాటు అలసటను తగ్గించడంలో కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి.
- గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, చికెడు పసుపు, తేనే కలిపి తీసుకుంటో జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- పూదీనా, చామంతి, మందార పువ్వులతో తయారు చేసిన హెర్బల్ టీ ఆరోగ్యానికి మంచిది.
- ఆకుకూరలు, పండ్లతో స్మూతీలు చేసుకుంటే విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
- ఉదయం వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, పుదీనా వేసుకుని మరిగించి తాగిదే శరీరం డీటాక్సిఫై అవుతుంది.
- క్యారెట్, బీట్రూట్, కీర జ్యూస్‌లో నిమ్మరసం, అల్లం కలిపి తీసుకోవచ్చు.
'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'
బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్‌గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ'