కోటి రూపాయల కరెన్సీతో లక్ష్మీదేవి అలంకరణలో వాసవీ మాత - VASAVI MATHA TEMPLE IN WANAPARTHY
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2024, 2:45 PM IST
Navarathiri Celebrations in Wanaparthy District: వనపర్తి జిల్లా పెబ్బేరు పురపాలకలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత మంగళవారం (అక్టోబర్ 08)న శ్రీ లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాసవి మాతను రూ. కోటి 11 లక్షల 11 వందల 111 తో శ్రీ లక్ష్మీదేవిగా అలంకరించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చనతో పాటు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూ. కోటికి పైగా డబ్బులతో అమ్మవారిని అలంకరించడంతో భక్తులు, పట్టణవాసులు వాసవి మాతను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. నగదు నోట్లతో ఏర్పాటు చేసిన దండలు వివిధ ఆకృతులు చూపరులను ఆకట్టుకున్నాయి. నవరాత్రులలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.