స్వర్గీయ రామోజీరావుకు జర్నలిస్టు సంఘాల సంతాపం - Journalist Unions Condolence Ramoji - JOURNALIST UNIONS CONDOLENCE RAMOJI
🎬 Watch Now: Feature Video
Published : Jun 14, 2024, 4:28 PM IST
Journalist Unions Condolence Ramoji Rao : ఏటా ఉత్తమ జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసే అవార్డులను రామోజీరావు పేరుతో ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రకటించింది. పాత్రికేయలోకానికి రామోజీ ఓ దిక్సూచీగా పేర్కొన్న ఫెడరేషన్ నాయకులు, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా హైదరాబాద్ త్యాగరాజ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు. రామోజీరావు కృషిని, ఆయనతో అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
తెలుగు పదాలకు ఈనాడు పుట్టినిల్లుగా పేర్కొన్న నేతలు, ఎందరో పాత్రికేయులను అందించిన అక్షర సైనికుడు రామోజీ అని కొనియాడారు. ఈనాడు అంటే క్రమశిక్షణకు మారుపేరని అక్కడ చేరిన వారు నేడు ఎంతో గొప్ప స్థానాల్లో ఉన్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. రామోజీ అంటే వ్యక్తి కాదు శక్తి అని, ఆయన ఏది చేసినా విజయం తప్ప పరాజయం అన్న పదం ఆయన నిఘంటువులోనే లేదని ప్రముఖ పాత్రికేయురాలు నాగరాణి అన్నారు. జీతమే కాదు ఎంతో మందికి జీవితాన్నిచ్చిన పత్రికా భగీరథుడు రామోజీ అని, తండ్రి తర్వాత అంతలా తాను అభిమానిస్తానని ప్రముఖ హాస్యావధాని శంకర నారాయణ అన్నారు.