యూజీ ప్రోగ్రామ్‌లలో స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీ మద్రాస్ - మహిళలకే అధిక ప్రాధాన్యం
🎬 Watch Now: Feature Video
IIT Madras Introduces Sports Quota in UG Programmes : యూజీ ప్రోగ్రామ్‌లలో స్పోర్ట్స్ కోటాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(IIT Madras) ప్రవేశ పెట్టింది. ఇలా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో క్రీడాకారులకు ప్రవేశాలను ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి ఐఐటీగా ఐఐటీ మద్రాస్ అవతరించింది. ఈ సీట్లలలో కనీసం సగం సీట్లు మహిళా విద్యార్థులకు కేటాయించనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. వచ్చే విద్యాసంవత్సరం 2024-25 నుంచే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(SEA)ను ప్రవేశపెట్టనున్నారు. వీటికి రెండు సూపర్ న్యూమరీ సీట్లను ఐఐటీ మద్రాస్ అందజేయనుంది. వీటిలో ఒకటి ప్రత్యేకంగా మహిళా విద్యార్థుల కోసం, మరోకటి భారతీయులకు ఇవ్వనున్నారు.
ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి వారు క్రీడల్లో రాణిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడమే లక్ష్యమంటూ ఐఐటీ మద్రాస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ స్పోర్ట్ సైన్స్ ఎనలైటిక్స్ అధినేత ప్రొఫెసర్ మహేశ్ పంచాగ్నుల తెలిపారు. భవిష్యత్తులో అధునాతన పరికరాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులై నుంచి స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ జరుగుతున్నందుకు సంతోషించారు. జాతీయ విద్యా విధానం 2020లో ఊహించిన విధంగా సంపూర్ణ విద్యను అందించడానికి ఇది చాలా ప్రగతిశీల దశ అని కొనియాడారు.
అర్హతలు : స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(SEA)కు ఒక విద్యార్థి తప్పనిసరిగా కామన్ ర్యాంక్ లిస్ట్(CRL) లేదా జేఈఈ(అడ్వాన్స్‌డ్) అర్హత సాధించాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కనీసం ఒక పతకం అయిన సాధించాలి. నిర్ధిష్ట క్రీడల జాబితాలో పనితీరు మెరుగుగా ఉన్న అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి ప్రత్యేక 'స్పోర్ట్స్ ర్యాంక్ జాబితా' (SRL) తయారు చేయబడుతుంది. ఈ జాబితా ఆధారంగానే ఆఖరి లిస్ట్‌ను సిద్ధం చేస్తారు.