ప్రజావాణిలో 'నాకు వీల్‌చైర్ కావాలంటూ' దివ్యాంగ విద్యార్థిని ఆవేదన
🎬 Watch Now: Feature Video
Huge public At Prajavani Program : ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధానంగా మహిళలు ప్రజాభవన్‌కు వచ్చి తమతమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన భూమిక అనే దివ్యాంగ విద్యార్థిని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని తనకు వీల్‌చైర్ కావాలని అధికారులకు వేడుకుంది. కర్రల సాయంతో నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయింది. గతంలో ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఏర్పాటు చేయలేదని ఇప్పుడైనా వీల్ చైర్ మంజూరు చేయాలని ఆమె తన సోదరితో కలిసి అధికారులను కోరారు.
మరోవైపు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే మహిళా కార్మికులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా ఫిల్టర్‌బెడ్ వద్ద 830 సర్వే నెంబర్లు భూమిని డాక్టర్ కూరపాటి రమేష్ అనే వ్యక్తి కబ్జాకు పాల్పడుతున్నాడని ఆ భూమిని కాపాడాలంటూ దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి తన ఆవేదనను చెప్పుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షలో అర్హులైన తమను ఏడేళ్లుగా వేచిచూస్తున్నారని తమకు విముక్తి కలిగించాలని ల్యాబ్ టెక్నిషియన్ నిరుద్యోగులు అవేదన వ్యక్తం చేశారు. 2017లో ల్యాబ్ టెక్నిషియన్ పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించలేదని ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.