ఇసుక రవాణా ట్రక్కులపై టార్పాలిన్ తప్పనిసరి- ఆ రెండు కంపెనీలకు హైకోర్టు నోటీసులు - SAND TRANSPORT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 10:07 AM IST
High Court Restrictions on Transportation of Sand, Other Mineral Resources : ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్తులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. అమికస్ క్యూరీ చేసిన పలు సూచనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఇసుక రవాణా చేస్తున్న అన్ని ట్రక్కులపై టార్పాలిన్ పట్టలు కప్పడం తప్పనిసరి చేసేలా జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులివ్వాలని గనులు, భూగర్భశాఖ అధికారులను ఆదేశించింది.
టార్పాలిన్ కప్పకుండా రవాణా చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంత జరిమానా విధించాలనే విషయంపై తదుపరి విచారణలో తేలుస్తామంది. ఈ విషయమై సలహాలు ఇచ్చే అంశాన్ని ఏజీ, అమికస్ క్యూరీలకు విడిచిపెట్టింది. ఏ సమయంలో ట్రక్కులు తిరిగేందుకు అనుమతించాలనేదానిపై అమికస్ క్యూరీ, ఇసుక రవాణాలో భాగస్వాములైన వారితో సంప్రదించాల్సిన అవసరం ఉందని ఏజీ చెబుతున్న నేపథ్యంలో తదుపరి విచారణలో ఈ వ్యవహారాన్ని చర్చిస్తామని తెలిపింది. జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది.