Heavy Fog in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజామునుంచే దట్టంగా పొగ మంచుకమ్మేయడంతో రోడ్లు కనిపించక వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ఓ వైపు చలి, మరోవైపు దట్టమైన మంచుతో చోదకులు ఇబ్బందిపడుతున్నారు. విమానాల రాకపోకలు సైతం ఆలస్యమయ్యాయి.
విమాన రాకపోకలకు అసౌకర్యం : రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకుంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగ మంచు కమ్మేసింది. దీని వల్ల విమాన రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. రన్ వే విజిబులిటీ సమస్యతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో సర్వీస్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. మంచు కారణంగా ఉదయం విమానాశ్రయం చేరుకోవాల్సిన సర్వీసులు అలస్యమవుతున్నాయి. అటు చెన్నై- కోల్ కతా జాతీయ రహదారిని పొగమంచు చుట్టేసింది.
నెమ్మదిగా రాకపోకలు : సిక్కోలులో దట్టమైన పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రహదారులను మంచు కమ్మేసింది. పొగమంచు వల్ల జాతీయ రహదారి పొడవునా వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా అంతటా పొగ మంచు వ్యాపించింది. గిద్దలూరులో వాహనాలు నెమ్మదించాయి. రోడ్లపై చోదకులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు సైతం నెమ్మదిగా రాకపోకలు సాగించాలని సూచిస్తున్నారు.
వాహనాలు కనిపించని పరిస్థితి : అలాగే హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచుతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని స్థితి నెలకొంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై హెడ్‌లైట్ల వెలుగులోనే వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. కూడళ్లలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.
Fog Alert: చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్ - జీవితాంతం చల్లగా ఉండొచ్చు
హైదరాబాద్లో పొగ మంచు ఎఫెక్ట్ - 30 విమానాలను ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించిన అధికారులు