'అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి'- విచారణ వాయిదా వేసిన హైకోర్టు - Election Litigation on ysrcp mp - ELECTION LITIGATION ON YSRCP MP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 12:50 PM IST
HC on 'Election Litigation' Filed by BJP Kothapalli Geetha Challenging the Election of Gumma Tanujarani : వైఎస్సార్సీపీ తరఫున అరకు లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన గుమ్మా తనూజరాణి ఎన్నికను సవాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దాఖలు చేసిన ‘ఎన్నికల వ్యాజ్యం’ పై హైకోర్టు స్పందించింది. తనూజరాణితో పాటు రిటర్నింగ్ అధికారి, ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనూజరాణి ఎన్నికల అఫిడవిట్‌లో వాస్తవాలను పొందుపరచలేదని, ఓట్ల లెక్కింపు సైతం సక్రమంగా జరగలేదని, ఈ వ్యవహారాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కొత్తపల్లి గీత తన వ్యాజ్యంలో తెలిపారు.
తనూజరాణి ఎన్నికను రద్దు చేసి తాను గెలుపొందినట్లు ప్రకటించాలని కోరారు. తాజాగా జరిగిన విచారణలో న్యాయమూర్తి స్పందిస్తూ తనూజరాణి ఇప్పటికే ఎంపీగా ప్రమాణం చేశారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ నిరర్థకం అవుతుందన్నారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది చంద్రమౌళి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు.