సాగునీటికోసం అన్నదాతల ఆందోళన - పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన - Farmers Dharna In Hanmakonda
🎬 Watch Now: Feature Video
Published : Mar 11, 2024, 5:21 PM IST
Farmers Dharna In Hanmakonda District : రాష్ట్రంలో నీటి ఎద్దడిపై రైతులు రోడ్డెక్కుతున్నారు. హన్మకొండ జిల్లా అంబాలకు చెందిన రైతులు సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. పరకాల-హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చివరి ఆయకట్టకు నీరందక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. డీబీఎం 22, డీబీఎం 22 బి నుంచి అంబాల, శ్రీరాములపల్లి, నేరెళ్ల, గూనిపర్తి, శనిగరం, మాదన్నపేట, గోపాలపురం గ్రామాల్లో ఇప్పటికే వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
మరోవైపు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం రాంపూర్ చౌరస్తా వద్ద అక్కెనపల్లి, ఘనపూర్ గ్రామాలకు చెందిన రైతులు కూడా నీటి సమస్య పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. తక్షణమే తమ గ్రామాలకు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడంతో అన్నదాతలు శాంతించారు. అనంతరం ఆందోళనను విరమించారు.