'వైనాట్ 175' వెనుక భారీ కుట్ర - అసలు కారణం అదే! : యార్లగడ్డ వెంకట్రావు - yarlagadda venkatrao
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 5:03 PM IST
Fake Votes in Gannavaram Constituency in Krishna District : గన్నవరం నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు దర్శనమిస్తున్నట్లు టీడీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైఎస్సార్సీపీ మరోసారి గద్దెను ఎక్కాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. అందుకు ఓటరు జాబితాలోని అవకతవకలే నిదర్శనమని పేర్కొన్నారు. ఒక్క గన్నవరంలోనే దాదాపు 1,672 దొంగ ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టారు. గత నెలరోజులుగా పార్టీ శ్రేణులు గ్రామాల్లోని ఓటరు జాబితాలను పరిశీలించగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు, గుడివాడ, పామర్రు, విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల నుంచి దాదాపు 948 దొంగ ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. మరో 724 ఓట్లు రెండేసి చొప్పున నియోజకవర్గంలో దర్శనమిస్తున్నాయని వెల్లడించారు.
ఒక్క గన్నవరంలోనే ఇన్ని దొంగ ఓట్లు ఉంటే ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఉంటాయే అర్థం చేసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో మృతుల ఓట్లను తొలగించండి మహాప్రభో అని రాజకీయ పక్షాలు మూడు సార్లు దరఖాస్తులు ఇచ్చిన ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైనాట్ 175 అంటున్న వైఎస్సార్సీపీ సీక్రెట్ దొంగ ఓట్లేనని యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. త్వరలో రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదులు చేయనున్నట్లు పేర్కొన్నారు.