'ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి- అప్పటి వరకు 144 సెక్షన్' - Election Counting Arrangements
🎬 Watch Now: Feature Video
Election Counting Arrangements : ఓట్ల లెక్కింపునకు విజయనగరం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం రెండు కేంద్రాల్లో ఏర్పాట్లన్ని పూర్తి చేశామని వెల్లడించారు. లెండి ఇంజినీరింగ్ కళాశాలలో నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ కు జెఎన్టీయూ- గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం పార్లమెంట్ కు 20టేబుళ్లు, అసెంబ్లీకి 4టేబుళ్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 2-3రౌండ్లలో పూర్తి కావచ్చన్నారు.
అదేవిధంగా ఈవీఎం లో పోలైన ఓట్ల లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 14టేబుళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా 18-20రౌండ్లలో లెక్కింపు పూర్తి కావచ్చని, సాయంత్రం 4-6గంటలకు మొత్తం ఫలితాలు వెల్లడి కావచ్చని అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు కోసం 972మంది సిబ్బంది, 500వరకు సహాయక సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ తో పాటు జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా, శాంతియుతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.