గూగుల్ మ్యాప్స్ 'ఫాస్టెస్ట్ రూట్'- మెట్లపైకి వెళ్లి ఇరుకున్న కారు! - గూగుల్ మ్యాప్స్ ఇరుకున్న కారు
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 8:52 PM IST
Car Stuck On Stairs Due To Google Maps : ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ప్రయాణించి కొందరు ప్రమాదాల బారినపడిన ఘటనలు చూశాం. ఇటీవలే కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో కొందరు చనిపోయారు కూడా. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ను నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డ ఒక కారు డ్రైవర్ తమిళనాడులోని కొండల పట్టణమైన గూడలూర్‌లోని మెట్ల సముదాయంలో చిక్కుకుపోయాడు. ఆ వ్యక్తి గూడలూర్ నుంచి తన స్నేహితులతో కలిసి డ్రైవింగ్ చేస్తూ కర్ణాటకకు తిరిగి వెళ్లే మార్గంలో గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించాడు. ఫాస్టెస్ట్ రూట్‌గా గూగుల్ మ్యాప్స్ ఇచ్చిన రూట్ ప్రకారం పోలీస్ క్వార్టర్స్ ద్వారా కారును పోనిచ్చాడు.
అయితే ఈ మార్గం వారిని నివాస ప్రాంతంలోని నిటారుగా ఉన్న మెట్ల వద్దకు తీసుకువెళ్లింది. ముందుకు వెళ్లలేక, ఆ వ్యక్తి వాహనాన్ని మెట్లపై నిలిపి స్థానికుల సహాయం కోరాడు. సమాచారం అందుకున్న చుట్టుపక్క ప్రజలు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయం చేసి కారు రోడ్డుపైకి పోనిచ్చారు. తమిళనాడు- కేరళ- కర్ణాటకల మధ్య ట్రైజంక్షన్ వద్ద ఉన్న గూడలూర్ ఒక ఫేమస్ హాలిడే స్పాట్. దీన్ని తరచుగా ఊటీకి వెళ్లే పర్యటకులు సందర్శిస్తారు.