"కిందపడిన వాడు ఏదో ఒక రోజు తిరిగి పైకి లేస్తాడు"- ఈ సామెత ఇప్పుడు అనిల్ అంబానీ విషయంలో నిజంగా జరిగినట్లు కనిపిస్తోంది. వ్యాపారవేత్తగా పతనంతో అనేక ఏళ్లుగా వినిపించని ఆయన పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. అనిల్ ఒక్కొక్కటిగా తన కంపెనీల రుణాలను తిరిగి చెల్లించి తిరిగి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు! ఇద్దరి మద్దతుతో మళ్లీ బిలియనీర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
Anil Ambani Comeback Debt Free : ఒకప్పుడు దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ ఆ తర్వాత పలు వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయారు. విపరీతమైన ఆర్థిక ఒడిదొడుకులను కూడా ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో తాను దివాలా తీసినట్లు కోర్టుకు అనిల్ అంబానీ చెప్పడం గమనార్హం! ఆయన కంపెనీల షేర్లు కూడా గరిష్ఠ స్థాయిల నుంచి పతనం అయ్యాయి. అయితే ఇప్పుడు తన ఇద్దరు కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ సాయంతో అంచెలంచెలుగా అనిల్ ఎదుగుతున్నారు.
అన్మోల్ అలా- అన్షుల్ ఇలా!
జై అన్మోల్, జై అన్షుల్ తమ తండ్రి వ్యాపారాలను పునరుద్ధరించాలని, రిలయన్స్ గ్రూప్‌కు తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. రిలయన్స్ గ్రూప్ కొత్త కాంట్రాక్టులను పొందేలా, గ్రూప్‌లోని అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా తమదైన శైలిలో పని చేస్తున్నారు. రిలయన్స్ క్యాపిటల్ పునరుద్ధరణలో జై అన్మోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంబానీ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ విధులను జై అన్షుల్ చూసుకుంటున్నారు.
18 ఏళ్ల వయసులోనే!
జై అన్షుల్ అంబానీ క్రమంగా వ్యాపారంలో మరింత చురుగ్గా మారుతున్నారు. జై అన్మోల్ అంబానీ 18 వయసులో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. 2014లో జై అన్మోల్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ విధులు అందుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జై అన్మోల్ అంబానీ వయసు ఇప్పుడు 33గా, జై అన్షుల్ అంబానీ వయసు 28 సంవత్సరాలు.