తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం హైకమాండ్‌దే : కిషన్ రెడ్డి - Kishan Reddy On BJP President Issue
🎬 Watch Now: Feature Video
Kishan Reddy On Telangana BJP President Appointment : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నియామకంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిల్లీలో స్పందించారు. అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, అది ఎప్పుడైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఏక్ పేడ్ మాకే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం) కార్యక్రమంలో భాగంగా, దిల్లీలో తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్క నాటారు. తన తల్లి అండాల్లమ్మ గుర్తుగా తన బంగ్లాలో రుద్రాక్ష మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచార కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
దేశ వ్యాప్తంగా వాతావరణం మారుతుందని, ప్రకృతి సమతుల్యం ఉండటం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అడవులు పచ్చదనం తగ్గిపోతుందని. పర్యావరణం పచ్చదనం పెంచేందుకు అమ్మ పేరుపై మొక్క నాటే కార్యక్రమానికి ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. భూమాత పేరుపై ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని, దేశ ప్రజలంతా అమ్మ పేరుపై చెట్టు నాటి పర్యావరణాన్ని పెంపొందించాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అంశాలపై కిషన్ రెడ్డి స్పందించారు. సుంకిశాల డామ్ కూలడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ విలీనంపై బీజేపీతో ఎటువంటి సంప్రదింపులు లేవని స్పష్టం చేశారు.