భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం - Bogatha Waterfalls - BOGATHA WATERFALLS
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 2:51 PM IST
Bogatha Waterfall in Mulugu : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అడివిలో బోగత జలపాతం పొంగిపొర్లాడుతుంది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌లోని అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతంలోని కొండా కోనల నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. వాగులు, వంకల నుంచి నీరు ప్రవహిస్తూ బోగత జలపాతం హోయలొలుకుతోంది. అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 50 అడుగుల ఎత్తుతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
ఈ నేపథ్యంలో బోగతను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడిప్పుడే పర్యటకులు జలపాత సందర్శనకు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటం, జలపాతం చూడటానికి వచ్చే పర్యాటకులు నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన ప్రాంతం వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ పరిధి దాటి ముందుకు వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.