మైనార్టీలకు బీజేపీ, మోదీ వ్యతిరేకం కాదు : కిరణ్‌కుమార్‌రెడ్డి - Kiran Kumar Reddy Meeting - KIRAN KUMAR REDDY MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 9:33 PM IST
BJP Leader Kiran Kumar Reddy Meeting in Madanapalle: ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు వ్యతిరేకమైతే ఇస్లాం పాలనలో ఉన్న దేశాల్లో అంతటి గౌరవం, పురాస్కారాలు ఎందుకు ఇస్తారో ఆలోచించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఏఏపై (Citizenship Amendment Act) ముస్లిం మైనారిటీలకు ఉన్న అపోహలను తొలగించే క్రమంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) పాల్గొన్నారు.
వివిధ ఇస్లాం చట్టాలు అమలులో ఉన్న దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) అందించిన అత్యుత్తమ పురస్కారాలు, సత్కారాలను ఆయన ప్రజలకు వివరించారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదని కిరణ్ అన్నారు. సీఏఏ అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించిందని తెలిపారు. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.