కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే వేడుకలు - వివాదంలో చిక్కుకున్న మాదాపూర్ సీఐ - Madhapur CI involved in controversy
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 4:37 PM IST
Madhapur CI Involved In Controversy : హైదరాబాద్ మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన ఓ పుట్టినరోజు వేడుకల్లో సీఐ పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేబుల్ బ్రిడ్జిపై ఎలాంటి బర్త్‌డే పార్టీలు నిర్వహించరాదని, ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటామని కొద్ది రోజుల క్రితం సదరు సీఐ హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఇదీ జరిగింది
పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దుర్గం చెరువు తీగల వంతెనపై బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ వేడుకల్లో మాదాపూర్ సీఐ మల్లేష్ సహా, మరో సైబరాబాద్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. కాగా ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు నిషేధమని ఇలా అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే కేబుల్ వంతెన ఫుట్‌పాత్‌పై కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. రూల్స్ ప్రజలకు మాత్రమేనని పోలీసులకు వర్తించదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన మాదాపూర్ సీఐ తాము ఫుట్‌పాత్‌పై మాత్రమే ఉన్నామని రోడ్‌పై కాదని తెలిపారు. నెటిజన్లు సైతం ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేయడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ స్పందించారు. కేబుల్ వంతెనపై బర్త్ డే వేడుకల అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.