How Kavach Train Protection System Works: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భాగమతి ఎక్స్‌ప్రెస్ కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రమాద పరిస్థితులను ధృవీకరించిన దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్.. సిగ్నల్ అందిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్తులను అరికట్టడంలో టెక్నాలజీ పాత్రపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ట్రైన్ యాక్సిడెంట్లలో తప్పు టెక్నాలజీదా..?, కవచ్ వర్కౌట్ కావట్లేదా..? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లకు భద్రతగా నిలిచే కవచ్ టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
అసలేంటీ కవచ్?:
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో ఇది ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ (ATP). లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయినా, ట్రాక్ సరిగా లేకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా అలాంటి సమయాల్లో మానవ తప్పిదాలు లేదా సిగ్నల్ వైఫల్యాల కారణంగా జరిగే ప్రమాదాలను ఇది నివారిస్తుంది.
లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తించే డివైజస్ ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే దీన్ని తొలిసారి 2017 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
కవచ్ టూల్స్:
7 test of Kawach done by Rail Minister @AshwiniVaishnaw from Sawai Madhopur to Sumerganj Mandi today:
— Trains of India (@trainwalebhaiya) September 24, 2024
1: Loco at 130Km/H, Signal at Danger, Kavach successfully stopped the train at signal in 50m proximity,
2: PSR (Permanent speed restriction) test, Loco running at 130Km/h but… pic.twitter.com/XPSO3b0l7q
- లోకో కవచ్: ఇది ట్రైన్ ఇంజిన్‌లో ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్ సిస్టమ్.
- స్టేషన్ కవచ్: ఇది రైల్వే స్టేషన్లలో అమర్చిన కంప్యూటర్ సిస్టమ్.
- రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్స్ (RFID ట్యాగ్స్): ఇవి పట్టాలపై నిర్దిష్ట వ్యవధిలో స్థిరంగా ఉంటాయి.
- GPS: ఇది రైలు ఎగ్జాక్ట్ లొకేషన్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
కవరైపెట్టై ప్రమాదాన్ని కవచ్ అడ్డుకోగలదా?:
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియకుండా ఇది చెప్పలేము. అయితే కవచ్ ఈ కింది సందర్భాల్లో మాత్రం ప్రమాదాలను నివారించగలుగుతుంది.
- సిగ్నల్ ఓవర్‌రన్ (SPAD): రైలు రెడ్ సిగ్నల్‌ను దాటితే కవచ్ ఆటోమేటిక్‌గా బ్రేక్స్ వేస్తుంది.
- హై- స్పీడ్: రైళ్లు నిర్దేశిత వేగ పరిమితుల్లో ఉండేలా కవచ్ చూస్తుంది. ఈ సాంకేతికత అధిక వేగంతో పట్టాలు తప్పిన రైళ్లను ట్రాక్ చేస్తుంది.
- హెడ్-ఆన్ కొలిజన్: ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే కవచ్ టెక్నాలజీ అత్యవసర చర్యగా రైళ్లను ఆపగలదు.
కవచ్ టెక్నాలజీ ప్రస్తుత స్థితి: ఏప్రిల్ 2022 నాటికి దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని 134 స్టేషన్లలో 1,445 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఇండియాలో ఉన్న మొత్తం 68,000 కి.మీ రైల్వే ట్రాక్‌లో కేవలం కొంత భాగంలో మాత్రమే దీన్ని అమలు చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలను అరికట్టేందుకు 10వేల రైలు బోగిల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ 'కవచ్ 4.0'ని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు 9వేల కిలోమీటర్ల మేర రైలు మార్గానికి కవచ్ వ్యవస్థను విస్తరింపజేయటానికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు.
కవచ్ ఎక్విప్మెంట్ అమర్చడం, సాంకేతికతను అమలు చేయడం కోసం కిలోమీటరుకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే ప్రస్తుతం రైల్వే శాఖలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఇండియా అంతటా కవచ్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కన్పిస్తోంది.
రైల్వే మంత్రిత్వ శాఖ పథకాలు: వచ్చే ఐదేళ్లలో 44,000 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీని అమలు చేయాలని ఇండియన్ రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దిల్లీ- ముంబయి, దిల్లీ- హౌరా వంటి ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం, భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. భారతీయ రైళ్ల వేగం, భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించే "మిషన్ రాఫ్తార్" పథకం కింద ఈ విస్తరణ జరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా?- ఈ యాప్‌తో మీ ప్రయాణం చాలా ఈజీ బాస్..!
టెక్నో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్- ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరంతే!