Meet Deceased People With Virtual Reality : కొన్ని అనుకోని సంఘటనలు, వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా మనం ఎంతగానో ఇష్టపడే కుటుంబసభ్యులు, స్నేహితులు ఈ ప్రపంచాన్ని విడిచి కానరాని లోకాలకు వెళుతుంటారు. అప్పుడు ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నేళ్లు గడిచినా వాళ్లు జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాదు.. వారి తాలూకు వస్తువులు, బహుమతులు, ఇతరత్రా ఏవి కనిపించినా మనసు మనసులా ఉండదు. అలాంటి టైమ్‌లో ఈ లోకాన్ని విడిచివెళ్లిన వారు నిజంగానే కళ్లెదుట ప్రత్యక్షమైతే.. నవ్వుతూ మనముందుకు నడిచొస్తే.. ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. దీన్ని చేసి చూపిస్తోంది ఓ టెక్నాలజీ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దక్షిణ కొరియాలో ఒక టీవీ షోలో కనిపించిన ఓ సన్నివేశం ప్రతి ఒక్కరినీ కదిలించింది. నాలుగేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి కూతురు.. "అమ్మా! నేను.. నిన్ను చాలా మిస్ అవుతున్నా" అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయింది. ఆ స్పర్శతో ఆ మాతృమూర్తి ఆనంద భాష్పాలు రాల్చింది.
ఇంతకీ ఇదెలా సాధ్యమైందంటే?
మరణించిన కూతురు తల్లి ముందు ప్రత్యక్షం ఎలా అయ్యిందంటే.. "వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ" ద్వారా! అవును.. కొరియాలో "మీటింగ్ యూ" పేరుతో వీఆర్ టెక్నాలజీ సహాయంతో చనిపోయిన వారిని మళ్లీ కళ్లముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని, స్పర్శ కోసం ప్రత్యేకమైన గ్లౌజునూ ఉపయోగించి చనిపోయిన పాపను కళ్లముందుకు తీసుకొచ్చారు. ఇలా కొరియాలో తయారుచేసిన "మీటింగ్ యూ" స్ఫూర్తితో గేమ్స్‌లో కనిపించే వీఆర్‌తో.. మనసుకు హత్తుకునే మధురజ్ఞాపకాల్నీ తీసుకొస్తున్నారు.
ఇండియాలోనూ ఈ టెక్నాలజీ..
ఈ టెక్నాలజీ విదేశాల్లోనే కాదు ఇండియాలోనూ ఉంది. తమిళనాడుకు చెందిన "హ్యాపీ టియర్స్" సంస్థ.. ఈ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌తో దూరమైన ఆత్మీయులను మళ్లీ కలిసే వెసులుబాటును అందిస్తోంది. రూపురేఖల కోసం ఫొటోలూ, పూర్తి వివరాలూ తీసుకుని నిజమైన రూపాన్ని తీసుకురావడమే కాదు, వీఆర్ కళ్లజోడును పెట్టుకోగానే.. వాళ్లు నిజంగానే మన ముందుకు నడిచొచ్చినట్టూ, మనల్ని ప్రేమగా కౌగిలించుకున్నట్టూ రకరకాల దృశ్యాలను తీర్చిదిద్దుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. వాళ్లతోపాటూ అందులో మనల్నీ చొప్పించేసీ... మనం వాళ్లతో సరదాగా గడుపుతున్నట్టు కూడా చూపిస్తారంటున్నారు.
ధర కూడా తక్కువే..!
ఇందుకోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. 2500 రూపాయలతో ఎవరైనా దీనిని చేయించుకోవచ్చు. ఆప్ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని వీఆర్ బాక్స్ ద్వారా వీక్షించొచ్చు.
ఇవీ చదవండి :
వర్చువల్ ATMలు వచ్చేస్తున్నాయ్- OTPతో దుకాణాల్లో క్యాష్ విత్‌డ్రా- ఎలాగో తెలుసా?
వర్చువల్ క్రెడిట్ కార్డ్స్‌తో ఆన్లైన్ ఫ్రాడ్స్‌కు చెక్! బెనిఫిట్స్ & లిమిట్స్ ఇవే!