Most Common PIN Patterns : ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్లైన్లోనే సొత్తు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో అయితే ఏకంగా 2024 మొదటి త్రైమాసికంలో 33 శాతం వరకు సైబర్ దాడులు పెరిగాయని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఫిషింగ్ స్కామ్స్, రాన్సమ్వేర్ లాంటి వివిధ పద్దతుల ద్వారా సైబర్ మోసగాళ్లు సామాన్యుల సొత్తును కొళ్లగొడుతున్నారు. ఈ నేరాల నుంచి తప్పించుకోవాలంటే ఏటీఎం, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, గూగుల్ పే, సోషల్ మీడియా అకౌంట్లు వంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాంగ్ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. లేదంటే సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
స్ట్రాంగ్ పిన్స్ పెట్టుకోవాలి!
బలహీనమైన(వీక్) పిన్, పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌లకు; డెబిట్, క్రెడిట్ కార్డులకు స్ట్రాంగ్ పాస్వర్డ్ లేదా పిన్‌లను పెట్టుకోవాలి. 1234, 0000 వంటి బలహీనమైన పిన్ నంబర్లు పెట్టుకుంటే, సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా వాటిని క్రాక్ చేయగలుగుతారు. తరువాత మీ అకౌంట్ నుంచి డబ్బును లేదా మీ డివైజ్‌లోని డేటాను ఈజీగా కొల్లగొడతారు.
వీటిని వాడొద్దు!
మీ పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వాటిని పిన్‌గా పెట్టుకోకూడదు. ఎందుకంటే, వీటి ఆధారంగా మీ యూపీఐ యాప్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ పిన్‌లను లేదా పాస్‌వర్డ్‌లను చాలా సులువుగా సైబర్ నేరగాళ్లు కనిపెట్టేయగలుగుతారు. అయితే చాలా మంది వ్యక్తులు వీక్ పిన్‌లను పెడుతున్నారని ఓ ప్రసిద్ధమైన సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. దాదాపు 34 లక్షల మంది వీక్ పిన్ లేదా వీక్ పాస్‌వర్డ్‌లను పెట్టుకున్నారని పేర్కొంది. వీటిలో 1234, 1111, 0000 లాంటివి అధికంగా ఉన్నాయని వెల్లడించింది. ఇటువంటి సాధారణ లేదా సులభంగా ఊహించగలిగే పిన్‌లను పెట్టుకోవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా కామన్‌గా ఉపయోగిస్తున్న వీక్ పిన్లు ఇవే:
- 1234
- 1111
- 0000
- 1212
- 7777
- 1004
- 2000
- 4444
- 2222
- 6969
జనరల్ పాస్వర్డ్స్ వద్దు!
సాధారణ పాస్వర్డులు, కామన్ పిన్ నంబర్లు పెట్టకూడదని ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్(ఈఎస్ఈటీ) సైబర్ నిపుణుడు జేక్ మూర్ హెచ్చరించారు. స్ట్రాంగ్ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను మాత్రమే పెట్టుకోవాలని ఆయన సూచించారు. వీక్ పిన్ పెట్టడం వల్ల సైబర్ దాడులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన హ్యాకర్లు వీక్ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను చాలా సులువుగా కనుక్కోగలరని హెచ్చరించారు. "సోషల్ మీడియా ఖాతాలు సహా, మీ వ్యక్తిగత ఖాతాలకు పుట్టిన సంవత్సరం, వ్యక్తిగత సమాచారం, రిపీటెడ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాస్వర్డ్ లేదా పిన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భద్రత కోసం పాస్వర్డ్ మేనేజర్లను ఉపయోగించాలి. ఈ టూల్ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుస్తుంది" అని మూర్ తెలిపారు.
Some Least Common 4-Digit PINs : ఈ కింద ఇచ్చిన పిన్లలాగా, మీరు ర్యాండమ్ నంబర్లను పిన్‌గా పెట్టుకోవాలి. అప్పుడే సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లను, డెబిట్, క్రెడిట్ కార్డులను హ్యాక్ చేయకుండా కాపాడుకోవచ్చు.
- 8557
- 8438
- 9539
- 7063
- 6827
- 0859
- 6793
- 0738
- 6835
- 8093
సైబర్ దాడుల నుంచి మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్లు భద్రంగా ఉంటాలంటే, పిన్ లేదా పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. స్ట్రాంగ్ పిన్, పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం, అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం బాగా తగ్గుతుంది.
కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 6 హక్కుల గురించి తెలుసుకోవడం మస్ట్! - Employee Basic Rights