Meta Facial Recognition Feature: ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో ఆన్లైన్ మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గత కొంతకాలంగా సెలెబ్రెటీల ఫేసెస్ను యాడ్ చేస్తూ ఏఐ సహాయంతో వస్తున్న యాడ్స్ పెరిగిపోయాయి. దీంతో ఈ స్కామ్స్ బారిన పడిన వారు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి మోసాలు అరికట్టడంపై మెటా దృష్టి పెట్టింది. ఇందుకోసం 'ఫేషియల్ రికగ్నైజేషన్' ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఫేక్ అని రుజువైతే ఆటోమేటిక్‌గా బ్లాక్: ఈ ఫీచర్ ఫేక్ యాడ్స్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఏదైనా యాడ్‌లో సెలబ్రిటీల ఫొటోస్ ఉపయోగించినా, మోసం జరిగినట్లు అనుమానం వచ్చినా అది ఫేషియల్ రికగ్నైజేషన్ను ఉపయోగిస్తుందని మెటా తెలిపింది. ఫేస్ మ్యాచ్ అయి అది ఫేక్ యాడ్ అని రుజువైతే ఆటోమేటిక్‌గా దాన్ని బ్లాక్ చేసేస్తుంది.
మెటా గతంలో ఫోటో ట్యాగింగ్ కోసం ఇదే టెక్నాలజీని ఉపయోగించింది. కానీ 2021లో ప్రైవసీ, రెగ్యులేటర్ పుష్బ్యాక్ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లోని ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా మళ్లీ మూడేళ్ల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను తిరిగి తీసుకురావాలని మెటా నిర్ణయించింది.
అందుబాటులోకి ఎప్పుడు?: ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మొదట ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సెలబ్రిటీలకు అందుబాటులో ఉండనుంది. సెలబ్రిటీలు ఫేక్ యాడ్స్ నుంచి ప్రొటెక్ట్ కోసం ఈ టూల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫీచర్ మరింతమందికి అందుబాటులో రానుందని మెటా వైస్ ప్రెసిడెంట్ మోనికా బికర్ట్ తెలిపారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఫోటో లేని వారికి ఈ కొత్త టూల్ సహాయం చేయదని మెటా తెలిపింది. ఈ టెక్నాలజీ కేవలం అడ్వర్టైజ్ మెంట్లలో జరిగే మోసాలను గుర్తించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని పేర్కొంది. అటువంటి యూజర్స్ మెటా ఇతర అకౌంట్ రికవరీ ఆప్షన్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్ టూల్స్ దుర్వినియోగం జరగకుండా ఆపుతుందని మెటా వైస్ ప్రెసిడెంట్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. మెటా ఈ ఫీచర్‌ను 2025లో ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తోంది. దీంతోపాటు వీడియో సెల్ఫీ ఆప్షన్‌పై కూడా మెటా పనిచేస్తోందని సమాచారం. ఇది యూజర్స్ లాక్ అయిన తమ అకౌంట్లో వారి గుర్తింపును నిరూపించుకునేందుకు ఉపయోగపడుతుంది.
స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కు బంపర్ ఆఫర్- వాటికి లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్..!
దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కారు- ఫీచర్లు, డిజైన్ చూస్తే మతిపోతోందిగా..!