Restriction on Laptop Imports: దేశీయంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై 2025 జనవరి తర్వాత పరిమితి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంతో నేరుగా సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని పేర్కొంది. వీటి దిగుమతులపై ఆంక్షలు విధిస్తే, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో సత్వరం తయారీ పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభావం ఎంత?: ఒకవేళ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఇప్పటివరకు వీటి ఇంపోర్ట్స్‌పై భారీగా ఆధారపడిన ఐటీ హార్డ్‌వేర్ మార్కెట్ ధోరణి మారిపోవచ్చు. ఈ నిర్ణయంతో 10 బిలియన్ డాలర్ల (సుమారు 84,000 కోట్ల) మేరకు ఈ పరిశ్రమపై ప్రభావం పడుతుందని అంచనా. వీటి దిగుమతులపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఇంతకుముందే వచ్చింది. అయితే అమెరికా కంపెనీల నుంచి బలమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశీయంగా తయారీ ప్రారంభించేందుకు కంపెనీలకు తగిన సమయం ఇచ్చినట్లు ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
త్వరలోనే చర్చలు!: ల్యాప్‌టాప్‌ల ఇంపోర్ట్స్‌పై పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థకు ఈ ఏడాదితో గడువు తీరనుంది. దీంతో వచ్చే ఏడాది చేసుకునే దిగుమతులకు మళ్లీ అనుమతులు తీసుకోవాలని కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 'కొత్త దిగుమతి అధీకృత వ్యవస్థ' కింద కంపెనీలు తమ దిగుమతులకు ముందస్తు అనుమతులు పొందాల్సి రావొచ్చని చెబుతున్నారు. దీంతో ఈ విషయమై త్వరలో అన్ని వర్గాలతో చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం కంపెనీలు ఆటోమేటెడ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్ని డివైజస్‌ను అయినా దిగుమతి చేసుకునే వీలుంది. హెచ్‌పీ, డెల్, యాపిల్, లెనోవో, శాంసంగ్ ఆధిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో మూడింట రెండు వంతుల దేశీయ గిరాకీ దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఇందులోనూ ఎక్కువ డివైజస్ చైనా నుంచే వస్తున్నాయి.
ఈ నిర్ణయంతో ప్రయోజనం ఎవరికి?: దిగుమతులపై ఆంక్షలు విధిస్తే మాత్రం దేశీయంగా ల్యాప్‌టాప్స్, కంప్యూటర్ల తయారీ కోసం అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న డిక్సన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. డిక్సన్ టెక్నాలజీస్.. దేశీయ గిరాకీలో 15 శాతానికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరో పక్క, దేశీయ తయారీని పెంచడం కోసం ఐటీ హార్డ్‌వేర్‌కు ప్రకటించిన పీఎల్‌ఐ పథకం కింద ఏసర్, డెల్, హెచ్‌పీ, లెనోవో వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తయారీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఏం చేస్తారంటే..?: 'కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆర్డర్' కింద కనీస నాణ్యతా ప్రమాణాలుండే ల్యాప్‌ట్యాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా నాణ్యత లేని పరికరాలు దేశంలోకి రాకుండా చేయొచ్చు. టారిఫ్ విధించాలంటే, అంతర్జాతీయ ఒప్పందాలు అందుకు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి దిగుమతులపై ఆంక్షలు విధించేందుకు తమ వద్ద అవకాశాలు తక్కువగానే ఉండొచ్చని ఓ అధికారి అన్నారు.
స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ లాంచ్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?