Google Has Restored Its All Deleted Apps In The Play Store : ప్లేస్టోర్ నుంచి యాప్‌లను తొలగిస్తే ఊరుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్‌తో టెక్ దిగ్గజం గూగుల్ వెనక్కు తగ్గింది. సర్వీస్ ఛార్జ్ చెల్లించలేదనే నెపంతో ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేసిన యాప్స్ అన్నింటినీ మళ్లీ (రీస్టోర్) పునరుద్ధరించింది.
సోమవారం- మీటింగ్
ప్లేస్టోర్ నుంచి భారత స్టార్టప్ కంపెనీలకు చెందిన యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేయడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం ఎన్నటికీ సంహించేది లేదని గూగుల్ కంపెనీని హెచ్చరించారు. దీనితో గూగుల్ వెనక్కు తగ్గి, తాము డిలీట్ చేసిన యాప్స్ అన్నింటినీ రీస్టోర్ చేసింది.
గూగుల్ కంపెనీకి, భారతదేశానికి చెందిన స్టార్టప్ కంపెనీలకు మధ్య సర్వీస్ ఛార్జీల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సోమవారం టెలికాం మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏమిటీ వివాదం?
గూగుల్ కంపెనీ సర్వీస్ ఫీజు చెల్లించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ ఆరోపించింది. కానీ సదరు కంపెనీల పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే షాదీ, మాట్రిమోనీ, భారత్ మాట్రిమోనీ, ఆల్ట్ (ఆల్ట్ బాలాజీ), ఆడియా ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ లాంటి యాప్‌లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిందే!
గూగుల్ కంపెనీ ప్లేస్టోర్‌లోని యాప్‌లపై 15 శాతం నుంచి 30 శాతం వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేసేది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో, గూగుల్ ఈ ఫీజులను 11%-26% వరకు తగ్గించింది. అయితే ఫీజులు తగ్గించినప్పటికీ చాలా యాప్‌లు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ పేర్కొంది.
ఫ్రీగా సేవలు అందించలేం!
ఛార్జీల వ్యవస్థను తొలగించాలని సీసీఐ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, గూగుల్ దానిని ఆమోదించలేదు. కేవలం ఛార్జీలను మాత్రమే తగ్గించింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనితో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లు అన్నీ కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని గూగుల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పలు యాప్‌లు గూగుల్‌కు డబ్బులు చెల్లించడం లేదు.
గూగుల్‌లో బెస్ట్ రిజల్ట్స్ రావాలా? ఈ టాప్-10 సెర్చ్ ట్రిక్స్ మీ కోసమే!