BSNL Announces 7 Initiatives with New Logo: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రవేట్ టెలికాం కంపెనీలన్నీ ఇటీవల రీఛార్జి రేట్లను పెంచడంతో చాలామంది యూజర్లు BSNLపై మొగ్గుచూపిస్తున్నారు. ఇదే సమయంలో మరింతమంది కస్టమర్లను ఆకర్షించే దిశగా BSNL అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 4G నెట్వర్క్ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు సరికొత్త లోగోను ఆవిష్కరించింది.
గతంలో రెడ్, బ్లూ, యాష్ కలర్స్‌తో ఉన్న లోగోను జాతీయ జెండా రంగులతో తీసుకొచ్చింది. కాషాయం, తెలుపు, గ్రీన్ కలర్స్‌తో చూడముచ్చట గా రూపొందించింది. ఇందులో కాషాయ రంగులో ఇండియా చిత్రపటాన్ని కూడా జోడించింది. BSNL.. Connecting Bharat.. Securely, Affordably, Reliably అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకుముందు లోగోలో Connecting India అని ఉండగా.. ప్రస్తుతం దాన్ని Connecting Bharatగా మార్చింది. BSNL ఈ కొత్త లోగోతో పాటు సూపర్ సెవెన్ సర్వీసులను తీసుకొచ్చింది.
BSNL కొత్త సర్వీసులు ఇవే:
1. చెకింగ్ స్పామ్ కాల్స్: యూజర్స్‌కు సురక్షితమైన మొబైల్ సేవలను అందించేందుకు స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్స్‌కు అనవసర కాల్స్ రాకుండా ఉంటాయి.
2. ఫ్రీ Wi-Fi రోమింగ్ సర్వీస్: ఫైబర్ ఇంటర్నెట్ యూజర్స్ కోసం ఫ్రీ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు దేశంలో ఎక్కడికి వెళ్లినా BSNL హాట్‌స్పాట్‌ను ఉపయోగించి ఉచితంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. తద్వారా డేటా ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఇది యూజర్లకు ఉపయోగపడుతుంది.
3. ఫైబర్ బేస్డ్ TV సర్వీస్: BSNL.. 500లకు పైగా లైవ్ ఛానల్స్, పే టీవీ ఆప్షన్‌లతో కూడిన కొత్త ఫైబర్ టీవీ సర్వీసును కూడా ప్రకటించింది. ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్కైబర్లు అందరూ అదనపు ఖర్చు లేకుండా 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే టీవీ స్ట్రీమింగ్ కోసం వినియోగించే డేటా నెలవారీ ఇంటర్నెట్ డేటా పరిగణలోకి రాదు.
4. ఆటోమేటెడ్ కియోస్క్‌ల ఏర్పాటు: వీటితో పాటు యూజర్స్ సిమ్ కార్డ్‌ల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్ (KIOSK)లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ కియోస్క్‌ల ద్వారా కస్టమర్లు BSNL సిమ్ కార్డ్‌లను సులభంగా కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు సిమ్‌లను ఈజీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాక సిమ్‌లను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
5. మారుమూల ప్రాంతాల్లో 5జీ: వీటితో పాటు C-DAC సహకారంతో మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు డీ2డీ టెక్నాలజీ, 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
6. డైరెక్ట్ టు డివైస్: దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైస్ (D2D) కనెక్టివిటీని పరిచయం చేసింది. ఇది శాటిలైట్, మొబైల్ నెట్‌వర్క్స్‌ను ఇంటర్‌కనెక్ట్ చేస్తుంది. ఈ వినూత్న కనెక్టివిటీ ఎమర్జెన్సీ కాల్స్, కనెక్ట్ లేని ప్రాంతాల్లో డిజిటల్ సర్వీస్‌ను అందించగలదు.
7. e-Auction: చివరగా BSNL సబ్‌స్క్రైబర్‌ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రత్యేక మొబైల్ నంబర్‌లను పొందే అవకాశాన్ని కల్పించింది. అంటే 9444133233, 94444099099 వంటి నంబర్లను e-auctionలో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వేలం చెన్నై, ఉత్తరప్రదేశ్, హర్యానా అనే మూడు జోన్లలో జరుగుతోంది.
దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కారు- ఫీచర్లు, డిజైన్ చూస్తే మతిపోతోందిగా..!
స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కు బంపర్ ఆఫర్- వాటికి లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్..!