ATMOS 2024: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నేటి నుంచి టెక్నాలజీ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు. హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్ ఈ టెక్నాలజీ ఫెయిర్ 'ATMOS 2024'కి వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో రోబోట్ వార్స్, డ్రోన్ రేసింగ్, హ్యాకథాన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా టెక్ ఎక్స్‌పో, ఇన్నోవేషన్స్, రేసింగ్, క్విజ్ పోటీలు కూడా ఈ ఈవెంట్లో ఉంటాయి.
ఈ ఏడాది స్పెషల్ ఇదే!: వివిధ కార్యకలాపాలతో ఏటా జరిగే ఈ ATMOS ఈవెంట్ అధిక సంఖ్యలో యువతను ఆకర్షిస్తుంది. ఈ ఏడాది టెక్నాలజీ ఫెస్టివల్లో స్పెషల్‌గా రోబో వార్స్ నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన 20కి పైగా రోబోలు ఈ పోటీలో పాల్గొంటాయి. ఈ ఈవెంట్లో డ్రోన్ రేసింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎఫ్‌పివి డ్రైవర్లు కూడా పాల్గొంటారు. ATV రేసింగ్‌లో విద్యార్థులు ఆటో ఎక్స్‌పో అండ్ టైమ్ అటాక్ కాంపిటీషన్‌లో భాగంగా వారు నిర్మించిన వాహనాలను నడుపుతారు. దేశవ్యాప్తంగా పది ఏటీవీ టీమ్‌లు పోటీపడనున్నాయి. విద్యార్థుల కోడింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే హ్యాకథాన్ కూడా ఉంటుంది.
టెక్ ఎక్స్‌పోలో AI, రోబోటిక్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఆవిష్కరణలతో సహా 100 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారు. 5,000 మందికి పైగా విద్యార్థులు తమ కొత్త ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ATMOSలో టెక్నికల్ కాంపిటీషన్స్, మ్యూజిక్ వర్క్‌షాప్స్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్స్, బిజినెస్ కాంపిటీషన్స్, గేమ్ రూమ్స్, పేపర్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ ఈవెంట్లో నిర్వహించిన అన్ని పోటీలకూ నిర్వాహకులు బహుమతులు అందజేస్తారు.
సెలబ్రిటీలు కూడా..!: టెక్నాలజీ ఫెస్టివల్‌కి ప్రముఖ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఇందులో ప్రముఖుల కాన్సెర్ట్స్ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, సందర్శకులకు మోడ్రన్ టెక్నాలజీపై పరిజ్ఞానాన్ని అందించడంతో మూడు రోజులపాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందించడమే ఈ టెక్నాలజీ మేళా లక్ష్యం. మరెందుకు ఆలస్యం మీరు కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటే ఈ ఈవెంట్లో పాల్గొని ఎంజాయ్ చేయండి. నేటి నుంచి నవంబర్ 10 వరకు ఈ టెక్నాలజీ ఫెయిర్ జరగనుంది.
ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి స్కోడా కారు- సెగ్మెంట్లోనే అతి తక్కువ ధరలో లాంచ్!
పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల ధరలు- అసలు తయారీకి కంపెనీలు ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలుసా?