iPhone SE Launch: యాపిల్ ఐఫోన్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఐఫోన్లో కొత్త సిరీస్, మోడల్స్ రాగేనే కొనేందుకు డబ్బున్నవారంతా ఎగబడుతుంటారు. అయితే వీటి ధర అధికంగా ఉండటంతో ఐఫోన్ అనేది సామాన్యులకు అందని ద్రాక్షలానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరలో ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఈ మొబైల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
యాపిల్ ఎస్‌ఈ మోడల్: యాపిల్ ఐఫోన్లకే కాదు.. ఆ కంపెనీ తయారుచేసే ఎస్‌ఈ మోడళ్లకూ క్రేజ్ అంతాఇంతా కాదు. తక్కువ ధరలో కాంపాక్ట్ సైజ్‌లో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్లకు సెపరేట్ ఫ్యాన్‌బేస్ కూడా ఉంది. సాధారణంగా ఐఫోన్‌లు పెద్దమొత్తం పెట్టి కొనలేని వారికోసం ఎస్‌ఈ మోడళ్లను యాపిల్ తీసుకొస్తూ ఉంటుంది. యాపిల్ మూడు ఎస్‌ఈ మోడళ్లను 2016, 2020, 2022లో తీసుకొచ్చింది. ఆ తర్వాత యాపిల్ ఎస్‌ఈ మోడల్ గురించి ఇప్పటివరకు ఏ ప్రకటనా చేయలేదు. అయితే యాపిల్ తన అప్‌డేటెడ్ ఐఫోన్ ఎస్‌ఈ మోడల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఓ కథనం ప్రచురించింది.
కొత్త ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌ను వీ59 అనే కోడ్ నేమ్‌తో రూపొందిస్తోందని తెలిసింది. యాపిల్ వచ్చే ఏడాది తీసుకురాబోయే ఐప్యాడ్ ఎయిర్ మోడళ్లతో పాటు ఈ అప్డేటెడ్ ఎస్‌ఈని లాంచ్ చేయాలని భావిస్తోందట. కొత్త ఎస్‌ఈలో 5జీని కూడా జోడించనుంది. పాత తరం హోమ్ బటన్‌కూ స్వస్తి పలికి రెగ్యులర్ ఐఫోన్ల మాదిరిగానే ఎడ్జ్-టు- ఎడ్జ్ స్క్రీన్ తీసుకురావాలని అనుకుంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఐఫోన్ 16 సిరీస్‌లో తీసుకొచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్(AI)ను కూడా ఎస్‌ఈ మోడల్‌లో జత చేయనున్నారని టాక్. గత ఎస్‌ఈ మోడల్‌ను ఐఫోన్ 8ను పోలిన డిజైన్‌తో తీసుకొచ్చారు. ఈసారి డిజైన్ ఎలా ఉండబోతున్నదీ ఆసక్తికరంగా మారింది. ఐఫోన్ 14ను పోలి ఉండబోతోందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ మోడళ్లను జే607, జే637 కోడ్ నేమ్స్‌తో యాపిల్ రూపొందిస్తున్నట్లు సమాచారం. మ్యాజిక్ కీబోర్డులను, మ్యాక్ కంప్యూటర్ లైనప్‌ను సైతం యాపిల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై యాపిల్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.
10 నిమిషాల్లోనే 'ఐఫోన్ 16' డెలివరీ- యాపిల్ ప్రియులకు ఇక పండగే! - iphone 16 Delivery in 10 Minutes
యాపిల్ ఇంటెలిజెన్స్‌తో ఐఫోన్ 16 సిరీస్- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched