Special Story On Food Vlogger Zubair Ali : హాబీ కోసం ఉద్యోగం వదిలేసి మరీ ఫుడ్ వ్లాగింగ్ చేస్తున్నాడు ఈ యువకుడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వెరైటీ రుచులను మనకి పరిచయం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బ్రాండింగ్ కంపెనీ లేదని గుర్తించి 'బజ్ బిజినెస్ సొల్యూషన్స్' అనే అంకురాన్ని నెలకొల్పాడు. ఫలితాలు ఆశించకుండా కష్టాన్ని నమ్ముకుని14 అవార్డులు సాధించాడు ఈ ఫుడ్ వ్లాగర్.
ఫుడ్ వ్లాగింగ్‌లో యువకుడి ప్రతిభ : హైదరాబాద్‌కు చెందిన ఈ ఇన్‌ఫ్లూయెన్స్‌ర్ పేరు జుబేర్ అలీ. కళాశాలలో చదువుతున్న రోజుల నుంచే ఫుడ్ వ్లాగింగ్‌పై ఆసక్తి కనబరిచాడు. హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తూ వంటలు నేర్చుకున్నాడు. వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నాడు. ఆ అంశాలను నలుగురికి చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా ఇన్‌స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫుడ్‌పై రివ్యూలు చేశాడు ఈ యువకుడు.
జాబ్ వదిలేసి ఫుడ్ వ్లాగింగ్‌పై ఆసక్తి పెంచుకుని : జుబేర్ చేసే ఫుడ్ రివ్యూలుకు నెట్టింట మంచి ఆదరణ వచ్చింది. దాంతో రివ్యూలతో మరింతగా రాణించాలనే ఆసక్తి, పట్టుదల పెరింది. 2017లో ఫుడ్ వ్లాగింగ్ కెరీర్‌గా ఎంచుకుని ఉద్యోగం మానేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో దొరికే ప్రతి ఆహారం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. మొదట పెద్దగా ఫాలోవర్స్ లేకపోయినా పట్టుదలతో ముందుకెళ్లాడు. రెండు సంవత్సరాల తర్వాత తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటున్నాడు.
Buzz Business Solutions Startup : అందరి ఫుడ్ వ్లాగర్స్‌లా కాకుండా రుచి చూసిన ప్రతి ఆహారానికి డబ్బు చెల్లిస్తానని చెబుతున్నాడు జుబేర్. వేరే రాష్ట్రాల్లో ఈ తరహా వ్యాపారం చేయడానికి బ్రాండింగ్ కంపెనీలు ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఒక్క బ్రాండింగ్ కంపెనీ కూడా లేకపోవటం గుర్తించి బజ్ బిజినెస్ సొల్యూషన్స్ అంకురాన్ని ప్రారంభించాడు. దీని ద్వారా కంపెనీలకు బ్రాండింగ్ చేస్తూ 13 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు జుబేర్.
ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ : ఎలాంటి ఫుడ్ టేస్ట్ చేసినా కూడా తనకు అనిపించింది మాత్రమే నిక్కచ్చిగా చెబుతాడు జుబేర్. అందుకే ఇన్‌స్టాగ్రాంలో 5 లక్షలకుపైగా ఫాలోవర్స్‌ను సాధించగలిగానంటున్నాడు. మొదటి నుంచి ఇప్పటి దాకా ఎక్కడా తప్పుడు సమచారం ఇవ్వలేదని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నాడు. ఆ కృషి ఫలితంగానే 14 అవార్డులు రావటం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ ఫుడ్‌వ్లాగర్.
ప్రత్యేక గుర్తింపు : ఎంచుకున్న వృత్తి ఏదైనా ఇష్టం, నమ్మకంతో చేస్తే విజయం సాధించొచ్చని నిరూపించాడు జుబేర్ అలీ. వేల మంది బ్లాగర్స్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకత సాధించాడు. హైదరాబాద్‌లోని టాప్-5 ఫుడ్ వ్లాగర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. భవిష్యత్‌లోనూ మరింత కచ్చితమైన సమాచారంతో ముందుకు వెళ్తూ ప్రజల మనసులను గెలుస్తానని ధీమాగా చెబుతున్నాడు.