River Linking Projects in AP: ఓవైపు నదుల్లో ఉరకలెత్తుతున్న వరద ఉప్పు సముద్రం పాలవుతోంది. మరోవైపు నీళ్లు లేక, కరవు కోరల్లో చిక్కి జనం అల్లాడుతున్నారు. సాగునీరు రాక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఇవేమి పట్టని జగన్ సర్కారు ఒంటెద్దు పోకడకలతో నదుల అనుసంధానాన్ని అటకెక్కించింది. భావితరాలకు కల్పతరువులైన జలవనరుల అనుసంధానానికి గత ప్రభుత్వం చేపట్టిన ‘మహాసంకల్పాన్ని కడలిపాలుచేసింది.
రాష్ట్రంలో 40 భారీ, మధ్య తరహా, చిన్నతరహా నదులు ఉన్నాయి. ట్రైబ్యునల్ అవార్డుల ప్రకారం కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏటా నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో ఉన్న ఒప్పందాల మేరకు బాహుదా, వంశధార, నాగావళి, పాలార్, పొన్నియార్ వంటి నదుల జలాలను వినియోగం సాగుతోంది. అయినా రాష్ట్రంలోని సాగు, తాగు అవసరాలకు నీరు చాలడం లేదు. తరచూ కరవు కాటకాల వల్ల కటకట తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను కాపాడాలి- నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్సు భేటీలో ఏపీ వాదన
నిజానికి గోదావరిలో ఏటా సగటున 2వేల 500 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంపాలవుతున్నాయి. ఈ జలాల్ని సద్వినియోగం చేసుకోవాలని గత తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. గోదావరి - పెన్నా అనుసంధాన ప్రణాళిక రూపొందించింది. పోలవరం జలాశయం నుంచి 320 టీఎంసీల వరద జలాలు పెన్నాకు తరలించాలన్నది ప్రణాళిక ప్రధాన లక్ష్యం. దీనిపై అధ్యయనం చేసిన వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది.
గోదావరి - పెన్నా అనుసంధాన ప్రాజెక్టుకు 83 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇది రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఉపయోగకరమని, అనేక ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద దాదాపు 150 టీఎంసీల సామర్థ్యంగల జలాశయం ఏర్పాటుకు గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు
గోదావరి, పెన్నా అనుసంధానంలో భాగంగా తొలిదశలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 73 టీఎంసీలు మళ్లించి 9.11 లక్షల ఎకరాల సాగర్ కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరించే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ దీనినే వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చింది. పనుల్ని మాత్రం గాలికొదిలేసింది.
2019లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ చర్చించిన అనుసంధాన ప్రక్రియ మాత్రం ముందుకు సాగలేదు. ఈ లోపు కేంద్ర జల్‌శక్తి శాఖ ఇచ్చంపల్లి వద్ద నుంచి కావేరికి గోదావరి జలాలు మళ్లించాలని డీపీఆర్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అదే సమయంలో గోదావరి-పెన్నా అంతర్గత అనుసంధానానికీ ముందడుగు వేయలేదు.
విజయనగరం జిల్లాలోని నాగావళిపై ఉన్న తోటపల్లి బ్యారేజీ కొత్త కుడి కాలువ ద్వారా సువర్ణముఖి నదికి ఒక చిన్న లింకు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే కాలువ నుంచి వేగవతి నదికి మరో అనుసంధానానికి ప్రణాళిక రూపొందించింది. కుడి కాలువ నీటిని గడిగడ్డ జలాశయానికి చేర్చి, అక్కడి నుంచి చంపావతికి అనుసంధానించాలని భావించింది. ఈ ప్రణాళిక ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నాగావళి నీటిని మళ్లించి కొంత వరకు సమస్య పరిష్కరించుకోవచ్చని తలచింది. 2017లోనే ఇందుకు 24.80 కోట్లతో తెలుగుదేశం ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేయకుండా, పనులను పక్కనపెట్టేసింది.
వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం జలాశయం నుంచి హై లెవెల్ కాలువ తవ్వి మహేంద్రతనయ, బాహుదా నదులను అనుసంధానించాలని గత ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 8.30టీఎంసీల నీటిని నిల్వ చేసేలా జలాశయాలు ఏర్పాటు చేయాలి. మెట్ట ప్రాంతాలైన ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని దాదాపు 75 వేల ఎకరాల ఆయకట్టుకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 6వేల 326 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లానే జగన్ దీనిని మూలకు పడేశారు.
Uttarandhra Sujala Sravanthi గోదావరి వరద జలాలను తొలుత గోస్తనీ నదికి, తర్వాత చంపావతి నదిపై ఉన్న గడిగడ్డ జలాశయానికి తరలించే పథకమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’. రెండు దశలుగా టెండర్లు పిలిచినా పనులు ముందుకు సాగడం లేదు. పోలవరం పూర్తయితే తప్ప ఈ పథకం కింద నీటిని తరలించడం వీలుపడదు. గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు జలాశయానికి మళ్లించే పథకం ఎప్పుడో పూర్తయింది. ఈ ఎత్తిపోతల ద్వారా 67వేల 614 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలన్నది లక్ష్యం.
తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం నుంచి నీటిని ఎత్తిపోస్తూ పోలవరం ఎడమ కాలువపై మరో ఎత్తిపోతల ఏర్పాటు చేసి ఆ నీటిని ఏలేరు జలాశయానికి మళ్లించడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినా జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోలేక నీటిని వినియోగించుకోలేక పోతున్నారు.
వంశధార - నాగావళి అనుసంధానం ప్రాజెక్టు కూడా వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో పూర్తి కాలేకపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్టకు నీళ్లు తీసుకెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఐదేళ్లలో దీన్ని పూర్తిచేయడంలో ఘోరంగా విఫలమైంది. కరవు రక్కసి ప్రమాదఘంటికలను మోగిస్తున్నా నీటిని ఒడిసిపట్టే స్పృహ కరువైంది.
ప్రాజెక్టులకు పేర్లు పెట్టడం కాదు.. వాటిని పూర్తి చేయాలి : గాదె వెంకటేశ్వరరావు