Five Accused Arrested in TDP Office Attack Case in Mangalagiri : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రెండు రోజుల క్రితం దాడి సమయంలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం 70 మందికిపైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఐదుగురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
TDP Central Office Attack Case : మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన ఐదుగురికి న్యాయమూర్తి వి. రామకృష్ణ 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్, గిరిరాము, ఖాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్వలిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి వాదనలు వినిపిస్తూ నిందితులపై హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదైనందున రిమాండ్ విధించాలని కోరారు.
నిందితుల తరఫున న్యాయవాదులు ఎర్రం నాగిరెడ్డి, దుష్యంత్ రెడ్డి, ఏటూరి కిషోర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడంతో పాటు అదనపు సెక్షన్లు జత చేసినందున రిమాండ్ తిరస్కరించాలని వాదించారు. ఇరువర్గాల వాదనల తర్వాత న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సేకరించిన ఆధారాలు సీసీ పుటేజ్, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, చిత్రాలు, 8 మంది ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాలను పొందుపర్చిచారు. 2021లో అక్టోబరు 19న టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై బద్రీనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేశారు. కొత్తగా మరో 27 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో వైఎస్సార్సీపీ కీలక నేతలు ఉండటంతో వారిపైనా కేసు నమోదు చేశారు.
పారిశ్రామిక వాడల అభివృద్ధికి కృషి : మంత్రి టీజీ భరత్ - TG Bharat on Industrial Parks in ap
వైఎస్సార్సీపీ కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు : ఇప్పుడు విచారణ వేగవంతం కావడంతో వైఎస్సార్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, విజయవాడ నగరపాలక వైఎస్సార్సీపీ ప్లోర్ లీడర్, విజయవాడ కార్పొరేటర్ తదితరులను నిందితులుగా చేర్చారు. మొత్తం ఇప్పటివరకు 56 మందిని నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. త్వరలోనే మరి కొందరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయినట్లు గుర్తించారు.
దాడిలో పాల్గొన్నవారు విజయవాడ నగరంలోని గుణదల, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా వైకాపా నేత దేవినేని అవినాశ్ అనుచరులుగా తేలింది. నిందితుల్లో పలువురు కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. 18వ డివిజన్ కార్పొరేటర్, వైకాపా ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి కుమారుడు రాజా, దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, గాంధీ సహకార బ్యాంకు డైరెక్టర్ జోగరాజు, మాజీ ఉప మేయర్ చల్లారావు, తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి ప్రమేయంపై సాక్ష్యాలు కూడా ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది.
అయితే వీరంతా నేతతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఇబ్బంది లేదని వారిలో భరోసా నింపేందుకు నేత ప్రయత్నిస్తున్నారు. నిందితులు అరెస్టు అయి అసలు సూత్రధారుల పేరు చెబితే ఇబ్బంది అవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని కంగారు పడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అవినాష్ అనుచరుల అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.