Youth Questioning Public Issues Through Social Media : పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది టైమ్‌పాస్‌కు ఉపయోగిస్తే మరికొందరు సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసమస్యలు తీరుస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని సమస్యలను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు స్థానిక యువత వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. గ్రామాల్లో ఉండే ప్రతి సమస్యలు వివరిస్తూ సంబంధిత అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ వినియోగంపై ఈ వేదికల ద్వారా ప్రశ్నిస్తున్నారు. సహ చట్టం ప్రకారం సంబంధిత శాఖల ప్రగతి నివేదికలు తీసుకుని ప్రభుత్వం పథకాల్లో, అధికారుల అవినితిపై ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. నర్సాపూర్ జిల్లాలోని చాక్‌పల్లి గ్రామస్థులకు బూర్గుప్లలి గ్రామ రేషన్ షాప్ ద్వారా ప్రజాపంపిణి సరకులను అందిస్తున్నారు. చాక్‌పల్లి గ్రామస్థులకు ఈ నెలలో అందించిన రేషన్ బియ్యంలో పురుగులు రావడంతో పేదలు ఎలా తింటారని స్థానిక డీలర్‌ను ప్రశ్నించారు. అలా ప్రశ్నించగా ఆ దుకాణానికి పురుగుల బియ్యం బస్తాలే పంపిణీ చేశారనే విషయం తెలిసింది.
పురుగులు పట్టిన బియ్యం ఎలా తినాలి : ఎంఎల్‌ఎస్ పాయించ్ అధికారుల నిర్లక్ష్యంతోనే నాసిరకం బియ్యం పంపిణీ చేశారని తెలియడంతో చాక్‌పల్లి సోషల్ వర్కర్ సయ్యద్ కలీం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఎక్స్‌లో గత నెల 8న ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. పేద ప్రజలు పురుగుల బియ్యం ఎలా తింటారని ప్రశ్నించారు. దీనికి స్పందించిన జిల్లా అధికారులు 20కిలోల పురుగుల బియ్యాన్ని మార్చేసి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేశారు.
లోకేశ్వం మండలానికి మారుమూలాన పోట్‌పల్లి-ఎడ్దూర్ గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు సక్రమంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేదు. దీంతో ప్రజలు ఎక్కువగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని గత నెల 11తేదీనా ఇదే గ్రామానికి చెందిన యువకుడు రంజిత్ కుమార్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆయన అదే రోజు స్పందించి మారుమూల గ్రామాలను వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని భైంసా డీఎంకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ఈ రెండు గ్రామాల్లోకి బస్సులు వస్తున్నాయి.