Brutal Murder in Bhupalpally District : కేవలం ఐదు గుంటల భూమి కోసం సొంత అన్నను అతని తమ్ముడు, మరో తమ్ముడి భార్య కలిసి పట్టపగలే దారుణంగా నరికి చంపిన ఘటన శనివారం (డిసెంబరు 14న) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారపాక సారయ్య (50)కు సోదరుడు సమ్మయ్య, మరో సోదరుడి భార్య (మరదలు) లక్ష్మితో కొంతకాలంగా భూముల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. దాంతో 8 నెలల కిందట గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి, ఎవరికి వచ్చేవి వారికి వాటాల లెక్కన పంచారు.
నిరాకరణ : వాటాలు పంచిన సమయంలో మిగులుగా వచ్చిన 5 గుంటల భూమిని వారి కుటుంబంలో పెద్దవాడైన సారయ్యకు ఇవ్వాలని గ్రామ పెద్ద మనుషులు నిర్ణయించారు. భూపాలపల్లిలో నివాసం ఉంటున్న సారయ్య శనివారం (డిసెంబరు 14) ఉదయాన్నే కుల పెద్ద మనుషులతో మరోసారి పంచాయితీ పెట్టించారు. గతంలో తీర్మానించిన ప్రకారం తనకు ఆ 5 గుంటల భూమిని ఇవ్వాలని కోరగా తమ్ముడు సమ్మయ్య, మరో తమ్ముడి భార్య లక్ష్మి నిరాకరించారు.
ఫిర్యాదు చేయడానికి వెళ్లేలోగా : దీంతో అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తన పెద్ద కుమారుడు శ్రీరామ్‌తో కలిసి సారయ్య వారి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో పక్కనున్న శంకరాంపల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చేరుకోగా, తమ్ముడు సమ్మయ్య, మరదలు లక్ష్మి, మరో ముగ్గురితో కలిసి మొదటగా వారిపై కారం చల్లారు. మారణాయుధాలైన గొడ్డలి, రాడ్లు, ఇనుప సుత్తితో దాడి చేశారు.
సరిగ్గా మెడపై గొడ్డలితో నరకడంతో తీవ్ర రక్త స్రావంతో సారయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన కుమారుడు శ్రీరామ్ ఎలాగోలా తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. కాటారం సీఐ నాగార్జునరావు, కాటారం, మల్హర్ ఎస్సైలు అభినవ్, నరేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యాహత్నం కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భూమి, కులాంతర వివాహం కోసమే చంపేశారు - కానిస్టేబుల్ హత్య కేసులో తమ్ముడి అరెస్ట్
కాస్త నెమ్మదిగా మాట్లాడు అన్నందుకే చంపేశాడు - అసలేం జరిగింది