Young Man Commits Suicide In Nizamabad : మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు, తనకు ఉద్యోగం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాసిపెద్ది ప్రశాంత్ (29) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇంతలోనే తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. బోధన్ ప్రాంతానికి చెందిన అమ్మాయితో ప్రశాంత్‌కు పెళ్లి నిశ్చయించారు.
శనివారం (17)న పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. ఇంతలోనే గురువారం ఉదయం ( ఆగస్ట్ 15న) ప్రశాంత్ డిచ్‌పల్లి మండల కేంద్రం శివారులోని గాయత్రి ఎన్‌క్లేవ్ వద్దకు చేరుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి బీటెక్ పూర్తయినా ఇప్పటికీ ఉద్యోగం రాలేదని, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎలా పోషించుకోవాలని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పి అతడు వారించేలోగా ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు.
అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందోళనకు గురైన ప్రశాంత్ స్నేహితుడు వెంటనే ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలిపాడు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో డిచ్‌పల్లి ఎస్సైకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు చివరగా కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేసి, గాయత్రి ఎన్‌క్లేవ్ వద్దకు చేరుకోగా అప్పటికే ప్రశాంత్ అపస్మారక స్థితిలో కన్పించాడు.
వెంటనే అతడిని కుటుంబీకులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ శుక్రవారం మరణించాడు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో కుమారుడి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. చేతికందివచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే రోజు కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీటితో ప్రశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ప్రశాంత్ మృతిపై శనివారం డిచ్‌పల్లి పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించి మృతుడి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రశాంత్ చనిపోయిన వెంటనే అతడికి చికిత్స అందించిన ఆస్పత్రి నిర్వాహకులు తమకు సమాచారం ఇవ్వాల్సి ఉందని ఎస్సై మహేశ్ తెలిపారు. అలా సమాచారం ఇవ్వకపోవడం నేరమన్నారు. కేసు దర్యాప్తు చేసి ఆస్పత్రి నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Two suicide in Triangle love ఇది మరో 'బేబీ' కథ..! విధి రాసిన మూడుముక్కలాటలో ఇద్దరు బలి!