Robin Sharma The Five AM Club Book : రాబిన్ శర్మ రచించిన ‘ది ఫైవ్ ఏఎమ్ క్లబ్’ వ్యక్తిత్వ వికాసంలో విశేషంగా గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. నిత్యం ఉదయం పూట సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఎలా వినియోగించుకోవాలో, ఆ దిశగా ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇది విద్యార్థులకూ, కెరియర్ ప్రారంభ దశలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతకూ ఎంతో ఉపయోగపడగలదు.
ఉదయాన్నే 5 గంటలకు మేలుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని జీవితంలో విజయానికి అవసరమయ్యే ‘విక్టరీ అవర్’ అంటారు రచయిత రాబిన్ శర్మ. ఆయన సూచన ప్రకారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ముందు ప్రణాళికతో 20 నిమిషాల చొప్పున మూడు భాగాలుగా చేసుకోవాలి.
వ్యాయామం, యోగా : శారీరక శక్తి పెంపు, మెదడు పనితీరులో చురకుదనానికి వ్యాయామం ముఖ్యం. ఇది బ్లెడ్ ప్రెజర్‌ను మెరుగుపరచడమే కాకుండా ప్రస్తుత జీవన శైలిలో ఎంతో శక్తిని సమకూరుస్తుంది. రోజులో లేవగానే మొట్ట మొదటి పనిగా ఎక్సర్‌సైజ్‌తో పాటు యోగా చేస్తే ఆ రోజంతా చురుగ్గా కదలవచ్చు. ధ్యానం, కృతజ్ఞతా భావన, వ్యక్తిగత లక్ష్యాలను ఆలోచించి పరిమితిలో విశ్లేషణలు చేసకోవడం కూడా మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఈ ఆత్మ చింతన కారణంగా స్థిరంగా పనులను చకచకా చేసుకోవచ్చు.
నేర్చుకునే సమయం : ఏదైనా కొత్త విషయం నేర్చుకునేందుకు సూర్యకిరణాలు భూమి మీద పడే సమయాన్ని అమృత కాలంగా చెప్పవచ్చు. ధ్యానం చేశాక ఏదైనా కొత్తది నేర్చుకునేందుకు 20 నిమిషాలు కచ్చితంగా కేటాయించాలి. కొత్త భాష నేర్చుకోవటం, కథలు రాయడం, మ్యూజిక్ ట్యూన్స్ ప్రాక్టిస్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవటం లాంటివి చేయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటే ఆలోచనలు మెరుగవటమే కాక, భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా స్కిల్స్‌ను నేర్చుకోవచ్చు.
విద్యార్థుల కోసం
క్రమశిక్షణ : ఉదయం 5 గంటలకు లేవడమనేది మానవుడి క్రమశిక్షణకు దారి చూపుతుంది. విద్యార్థులు రోజును సక్రమంగా ప్రారంభించగలిగితే రోజంతా చురుకుదనంతో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
పరీక్షల ఉన్నప్పుడు : ఈ సమయంలో విద్యార్థుల మెదడు అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండటం వల్ల ప్రాతఃకాలం చదువుకున్న విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. రివిజన్ చేసేటప్పుడు సులువై పరీక్షల్లో ఉత్తమమైన మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
సృజనాత్మకత : ఉదయం పూట మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు కలగడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరొచ్చు. విద్యార్థులు తమకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్టులు, ఎస్సే రైటింగ్స్, రిసెర్చ్లపై పని చేయవచ్చు.
కెరియర్ ప్రారంభంలో
- లక్ష్యం పై గురి : కెరియర్ ఆరంభ దశలో ఉన్న యువత ముందుగానే లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. పొద్దున సమయాన్ని వారి ప్రాధాన్యాలకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటే గెలుపునకు మార్గం సుగమమవుతుంది.
- ఉత్సాహం డబుల్ : ఈ పద్ధతిలో వ్యాయామం, ధ్యానం, నేర్చుకోవడం అనేవి యువతి, యువకులలో ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ చాలా పెంచుతాయి.
- కొత్తగా ఆలోచించగలగడం : సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుకుంటే చేసే ప్రతి పనిలో కొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. ఇది ప్రత్యేకించి కొత్త టెక్నాలజీ, స్కిల్స్‌ను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది.
పుస్తకంలోని ముఖ్య సూత్రాలు
మనిషిలోని నాలుగు రాజ్యాలు
మనసు: ఆలోచనలను బలంగా కట్టుదిట్టంగా అదుపులో ఉంచుకోవడం.
హృదయం: కృతజ్ఞతాభావం, ప్రేమ, ఆత్మాభిమానాలను పెంపొందించడం.
ఆరోగ్యం: శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడం.
ఆత్మ: ఆధ్యాత్మికత, ఎథిక్స్‌ను డెవలప్ చేసుకోవడం.
అలవాట్లను అలవర్చుకునే ప్రధాన సంఖ్య 21
మూడున్నర వారాల(21 రోజులు) వ్యవధిలో ఏదైనా అలవాటు చేసుకోవడం అవుతుందని రచయిత రాబిన్ శర్మ తన పుస్తకంలో వివరించారు. ఈ ప్రక్రియలో మూడు స్టెప్స్ ఉన్నాయి.
మొదటిదశ - పాత అలవాట్లతో ఇబ్బందులు : ఈ దశలో కొత్త అలవాటును అమలు చేయడంలో తొలుత కష్టాలు ఎదుర్కొంటారు.
మధ్యదశ - కొత్తది అలవాటు చేసుకోవడం: దీనికి నిరంతర పట్టుదల, కృషి అవసరమవుతాయి.
చివరిదశ - జీవితంలో భాగం : కొత్త అలవాటు పూర్తిగా జీవితంలో మీ భాగం అవుతుంది.
జీవితంలో పెద్ద మార్పులు చూడాలనుకుంటే ఫైవ్ ఏఎమ్ క్లబ్ పుస్తకం నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ప్రతి రోజు క్రమశిక్షణతో ప్రారంభమైతే ఆ రోజంతా సక్సస్ఫుల్ అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ముందు ప్రణాళికలు చిన్నచిన్న లక్ష్యాలను చేరుకునే దారులను ఏర్పరుస్తాయి. ఉదయం లేచినంత మాత్రాన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రావు. ఆ సమయంలో రోజంతా, తద్వారా మిగతా జీవితమంతా మెరుగ్గా ఉండేందుకు అడుగులేస్తేనే లక్ష్య సాధన పూర్తవుతుంది. మార్పునకు ప్రారంభం మనం ఉదయం ఐదింటికి లేవడమే తొలిమెట్టు అవుతుంది!
-రహ్మాన్ ఖీ సంపత్
బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయలా? ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది!
వ్యాయామం అంటేనే చిరాకు వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే రోజూ ఈజీగా చేసేస్తారు!