CS Letter to ACB on Formula E-Race : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అవినీతి నిరోధకశాఖకు విచారణ జరపాలంటూ లేఖ రాశారు. ఈ లేఖ అందిన వెంటనే ఏసీబీ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపడతారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడతారు.
అధికారి ఎవరైనా తన అధికారాన్ని దుర్వినియోగ పరచడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని భావించినప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. ఫార్ములా-ఈ కారు రేసులో అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. దాంతో ప్రధాన కార్యదర్శి లేఖ ఆధారంగా ఏసీబీ అధికారులు తొలుత ఆర్ఈ నమోదు చేస్తారు.
ముందుగా నోటీసులతో ప్రారంభం : కారు రేసు నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధులు విడుదలకు సంబంధించి జారీ అయిన ఉత్తర్వులు వంటి వాటిని పరిశీలిస్తారు. వీటిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. దర్యాప్తులో భాగంగా ఈ-రేస్‌కు సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు. రేసు నిర్వహణకు అనుమతి లేకుండానే నిధుల విడుదల చేశారనే ఆరోపణపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించనుంది.
ఆర్బీఐ అనుమతి ఉందా లేదా? : హెచ్ఎండీఏ బోర్డు సభ్యులతో పాటు ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటి నిబంధనలు ఏవీ పాటించకుండానే సరాసరి ఫార్ములా సంస్థకు హడావుడిగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో మరీ ముఖ్యంగా రూ.46 కోట్ల వరకూ విదేశీమారకం రూపంలో విదేశీ సంస్థకు చెల్లించారు. విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, అవేవి పాటించకుండా ఓ ఫార్ములా ఏజెన్సీ సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో ఈ నిబంధన ఉల్లంఘించారని తెలుస్తోంది. వీటన్నింటిపైనా దర్యాప్తు జరగనుంది.
కేటీఆర్ పాత్రపై విచారణ : దీంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అప్పటి అధికారులతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? లేదా అన్నదానిపై దర్యాప్తు జరపనుంది. దీనిలో భాగంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించిన వారందరినీ ఒక్కోక్కరిని పిలిచి విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేస్తారు. అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే దానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ సేకరిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా? అన్న అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ సంస్థకు చెల్లించిన రూ.55 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి? అవి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి? వంటి వాటన్నింటినీ ఏసీబీ తేల్చాల్సి ఉంటుంది.
దర్యాప్తులో భాగంగా ఫార్ములా సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో అందుకు బాధ్యులైన వారిని అరెస్టు తప్పకపోవచ్చు. దాంతో రాబోయే రోజుల్లో ఫార్ములా- ఈ రేసు సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు.
సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ తప్పా?: కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారం - మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసుకు రంగం సిద్ధం!