Couple Divorced After 43 Years Of Marriage : హరియాణాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 73ఏళ్ల భార్య, 69ఏళ్ల భర్త విడాకులు తీసుకున్నారు. తమ 43ఏళ్ల వివాహ జీవితానికి స్వస్తి పలికారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భార్యకు శాశ్వత భరణం కింద రూ.3.7కోట్లు ఇచ్చేందుకు భర్త అంగీకరించాడు. అయితే భరణం ఇవ్వడానికి ఆ భర్త తన వ్యవసాయ భూమిని సైతం అమ్మేశాడు. ఈ దంపతులు ఇద్దరూ గత 18ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు.
1980లో వివాహం
వారిద్దరికీ 1980 ఆగస్టు 27న హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కాలం గడిచేకొద్దీ దంపతుల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో 2006 మే 8 నుంచి ఇద్దరు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన భార్య మానసింగా హింసిస్తోందని భర్త భర్త కర్నాల్ కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే 2013 జనవరిలో ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
హైకోర్టులో అప్పీల్
అనంతరం భర్త ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ క్రమంలో 2024 నవంబర్ 4న ఇరువర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిగింది. భార్య, ముగ్గురు పిల్లలకు రూ.3.7 కోట్లు శాశ్వత భరణం చెల్లించి తన వివాహాన్ని రద్దు చేసుకోవడానికి భర్త అంగీకరించాడు. దీన్ని శాశ్వత భరణంగా పరిగణిస్తామని ఒప్పందంలో స్పష్టం చేశారు. భార్య కూడా ఒప్పుకుంది. కానీ దీని తర్వాత భార్య, పిల్లలు భర్త లేదా అతడి ఆస్తిపై ఎలాంటి హక్కులను పొందరు.
ఒప్పందం ప్రకారం భరణం చెల్లించడానికి భర్త తన వ్యవసాయ భూమిని రూ.2.16కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను భార్యకు ఇచ్చాడు. అంతేకాకుండా తన చెరకు పంట విక్రయించగా వచ్చిన మొత్తంలో జే-ఫారం కింద రూ.50 లక్షల నగదు చెల్లించాడు.
చనిపోయిన తర్వాత కూడా ఆస్తిపై హక్కు లేదు
ఈ కేసులో భర్త చనిపోయిన తర్వాత కూడా భార్య, పిల్లలు ఆస్తిపై క్లెయిమ్ చేయరాదని మధ్యవర్తిత్వం ద్వారా నిర్ణయించారు. ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తూ జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీలతో కూడిన ధర్మాసనం వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.