Massive Rush in Yadadri Temple : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్‌లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 2 గంటల సమయం పడుతోంది. కొండ కింద ఆధ్యాత్మికవాడలో గల వ్రత మండపం, పుష్కరిణి, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ భక్తులతో రద్దీగా మారింది.
మరోవైపు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి ఆలయ అర్చకులు యాదాద్రి శ్రీలక్ష్మీ స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సుమారు గంట పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ సన్నాయి మేళాల సప్పుళ్లతో ఆలయ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు, విశిష్టతను తెలియజేశారు.
లక్ష పుష్పార్చన పూజల్లో ఆలయ ఈవో భాస్కర్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఈవో భాస్కర్‌రావు మాట్లాడుతూ యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి అనేక మౌలిక వసతులకు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ మాడవీధిలో ఎల్ఈడి, స్క్రీన్లు, ద్వార ఆలయ నిత్య కైoకర్యాల నిర్వహణ వీడియో ప్రదర్శన, సంగీత సాహిత్య ధార్మిక సభల నిర్వహణకు ప్రత్యేకమైన షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
యాదాద్రిలో అవతరణోత్సవాలు.. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు జాతీయ పతాక ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం యాదాద్రి ఆలయ సన్నిధిలో ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఆలయ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఆలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్ములన దిశగా అందరూ సహకరించాలని కోరారు. ప్రతి నిత్యం భక్తులకు అన్నదాన వితరణ ప్రస్తుతం 600 గా ఉంది 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు.. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు సంప్రదాయ దుస్తులను ధరించి దర్శనానికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రతి మంగళవారం నాడు యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు సాంప్రదాయ దుస్తులతో అంతరాలయ దర్శనం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వారికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.