World Cancer Day 2024 : ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ప్రపంచ క్యాన్సర్లలో 8వ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఆసియా దేశాల్లోనే సుమారు 60 శాతం కేసులు నమోదవ్వడం ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తోంది. అంతేగాక ఆసియా దేశాల్లోనే 57.4శాతం సర్వైకల్ క్యాన్సర్ మరణాలు సంభవించడం చూస్తుంటే ఈ క్యాన్సర్ మహమ్మారి తీరు ఏంటో అర్థమవుతోంది. కొత్తగా నమోదతువుతున్న కేసుల్లో 25.6 శాతం సర్వైకల్ క్యాన్సర్లే కావడం గమనార్హం.
Cervical Cancer leading Death : ముఖ్యంగా భారత మహిళల్లో వస్తోన్న క్యాన్సర్లలో రెండవ స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. దీనిని నియంత్రించడానికి 2030 నాటికి 90-70-90లక్ష్యంతో (WHO) ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకి వెళ్తుంది. అటు మధ్యంత బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించింది. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలకు వ్యాక్సినేషన్లు ప్రోత్సహిస్తామని తెలిపింది.
క్యాన్సర్ ఈ పేరు చెబితే చాలు ఎంతో మంది వణికిపోతుంటారు. కుటుంబంలో ఆ మహమ్మారితో బాధపడిన వారిని గుర్తు చేసుకుని చెమ్మగిల్లుతుంటారు. రాచపుండు బారిన పడితే బతుకు భారమే అని ఆందోళన చెందుతుంటారు. వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు చేయలేక ఐనవారి ప్రాణాలను వదిలిపెట్టలేక సతమతమవుతుంటారు. క్యాన్సర్ ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఇంటిల్లి పాది కుంగిపోతుంది. ఆర్థికంగా, మానసికంగా ఈ వ్యాధి అందరినీ అతలాకుతలం చేస్తుంది.
క్యాన్సర్ డే రోజు నటుడి పోస్ట్ - భార్య గురించి ఎమోషనల్!
అలాంటి రాచపుండులో అనేక రకాలు ఉన్నా మహిళలను ఎక్కువగా కబళిస్తుంది మాత్రం సర్వైకల్ క్యాన్సరే. దేశంలో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భాశయ క్యాన్సర్లది రెండో స్థానం. అయితే మరణాల్లో మాత్రం సర్వైకల్ క్యాన్సర్లదే తొలిస్థానం కావటం గమనార్హం. మరీ ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ తరహా క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
Cervical Cancer Death In Telangana : సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలో వైరస్ వల్లే వచ్చే ఓ రకమైన క్యాన్సర్. ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరస్. మహిళల గర్భాశయ కింది భాగాన్ని సర్విక్స్ అంటారు. ఆ ప్రాంతంలోని కణాల్లో (HPV) హెచ్‌పీవీ వైరస్ వల్ల మార్పులు జరిగి క్యాన్సర్‌గా మారటాన్నే సర్వైకల్ క్యాన్సర్‌గా చెబుతారు.హెచ్‌పీవీలో సుమారు 200రకాలు ఉండగా అందులో HPV 16, HPV 18 రకాలు ఎక్కువగా క్యాన్సర్‌కు కారణమవుతుంటాయి. అయితే సాధారణంగా ప్రతి మహిళా లైంగిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఏదో ఒక సమయంలో ఈ వైరస్ బారినపడే అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి శరీరంలోకి వైరస్ వ్యాపించినప్పటికీ అది వ్యాధిగా మారి లక్షణాలు బయటపడటానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో సర్వైకల్ క్యాన్సర్ని రొమ్ము క్యాన్సర్ల లక్షణాల ద్వారా ముందుగా గుర్తించటం కాస్త కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు 45 ఏళ్లు పైబడిన వారిలో బయటపడే ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు 35 ఏళ్ల లోపే వెలుగు చూస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్యాన్సర్ లక్షణాలు కన్పించగానే దాన్ని నిర్ధరించుకోవడానికి ముందుగా పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది పాప్స్మియర్టెస్టు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ ఉందని తేలితే దాని తీవ్రతను బట్టి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు.
Cervical cancer : దేశంలో ఏటా 1.23లక్షల మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుండగా సుమారు 67వేల మంది మరణిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా యూపీలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, పశ్చిమ్బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఏపీలో ఏటా 17వేల 146 కేసులు నమోదవుతుండగా తెలంగాణలో 11,525 కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అల్ప ఆదాయం ఉన్న ప్రాంతాల్లోని మహిళలే ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్ , ఖమ్మం వంటి జిల్లాల్లో సర్వైకల్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్టు ఎమ్ఎన్జీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత స్పష్టం చేశారు.
ఎక్కువ శాతం పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు 18 ఏళ్లు రాకుండానే పెళ్లి చేయటం ద్వారా వారు త్వరగా తమ లైంగిక జీవితాన్నిప్రారంభిస్తున్నారు. ఇది సర్వైకల్ క్యాన్సర్‌కి దారితీస్తున్న పరిస్థితుల్లో ఒకటిగా WHO చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలను కనటం, గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా వాడటం, అపరిశుభ్రమైన లైంగిక చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం వంటివి సర్వైకల్ క్యాన్సర్లకు ప్రధాన కారణాలని WHO చెబుతోంది.
Cervical cancer special story : సాధారణంగా వ్యాధి లక్షణాలు బయటపడే వరకు సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించటం కష్టమే. నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా కావడం, లైంగిక చర్య తర్వాత బ్లీడింగ్, నొప్పి వంటివి సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలుగా వైద్యులు పరిగణిస్తుంటారు. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. HPV DNA టెస్టింగ్, పాప్స్మియర్, పెల్విక్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షల ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్లు దాటిన మహిళలు తప్పక ప్రతి మూడేళ్లకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక 35ఏళ్లు దాటిన వారు ఐదేళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
World Cancer Day 2024 : అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కేవలం లక్షలో 0.5 శాతం మంది మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వ్యాక్సినేషన్. అమెరికాలో ఇప్పటికే HPV వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయటంతో అక్కడ సర్వైకల్ క్యాన్సర్లు సంఖ్య సైతం గణనీయంగా తగ్గినట్టు WHO స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 2023 నాటికి సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు కేంద్ర ప్రత్యేక చర్యలు చేపట్టింది. 90-70-90 లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 9 నుంచి 14 ఏళ్ల పిల్లలకు 90 శాతం వ్యాక్సినేషన్, 70 శాతం మహిళలను స్క్రీనింగ్ చేయటం, వ్యాధికి గురైన మహిళలకు 90 శాతం మంచి వైద్యాన్ని అందిచటం ద్వారా వ్యాధిని కట్టడి చేయాలని భావిస్తోంది. వాటితో పాటు స్వీయ రక్షణ కూడా ముఖ్యమేనని చెబుతోంది.
Sakinala Savitramma:'అప్పుడు అంతా నవ్వుకున్నారు.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు'
genome sequencing : జన్యు విశ్లేషణపై దృష్టి సారించిన కేంద్రం..