Woman Attacked By Stray Dogs : వాకింగ్‌కు వెళ్లిన ఓ మహిళపై వీధికుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. శునకాల గుంపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఇటీవల జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదీ జరిగింది : బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రపురి కాలనీలో ఓ మహిళ వాకింగ్‌కు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని శునకాలు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు ఆమెపై దాడికి ప్రయత్నం చేశాయి. ఊహించని అనూహ్య పరిణామం నుంచి మహిళ తేరుకునేలోపే ఆమెను శునకాలు చుట్టుముట్టాయి.
వీధి కుక్కల నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ కేకలు వేసింది. ఆ విధంగా చాలా సమయం వాటి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్ర ప్రయత్నం చేసింది. అయినప్పటికీ శునకాలు దాడి చేస్తుండగా ఆమె కిందపడిపోయింది. ఇంతలో అదే మార్గంలో ఓ ద్విచక్రవాహనదారుడు రావడంతో వీధికుక్కలు పరుగులు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డయ్యాయి.
Video of dog attack goes viral : ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత మహిళ భర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టి వీధి శునకాలకు ఇంటి బయట అన్నం పెట్టవద్దని కోరారు. ఇంటి ముందు కుక్కలకు భోజనం పెడితే తన భార్యకు ఎలాంటి పరిస్థితి దాపురించిందో రేపు మీకు కూడా ఆ పరిస్థితి రావచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం అది కాస్త వైరల్‌గా మారింది.
గతంలోనూ పలువురిపై దాడికి పాల్పడిన శునకాలు : గతంలో కూడా ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఆ వార్తలు సంచలన సృష్టించాయి. వీధికుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇలా ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఒంటరిగా కనిపిస్తే బలి - పెరిగిపోతున్న వీధికుక్కల కాట్లు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కల స్వైర విహారం - కాటేయకుండా కాపాడరూ?