Not Allowing Outside Food in Gurukul and Welfare Hostels : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గురుకుల, సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా సంక్షేమ శాఖలు, గురుకుల సొసైటీలు అప్రమత్తమయ్యాయి. బయట నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని వసతి గృహాల్లో, విద్యాలయాలు అనుమతించడం లేదని, ఈ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని గురుకులాల ప్రిన్సిపాళ్లకు, వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో సంక్షేమశాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రిన్సిపాళ్లతో సొసైటీలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.
పిల్లల కోసం తల్లిదండ్రులు బిర్యానీ, చిరుతిళ్లు తీసుకువస్తే ఎట్టి పరిస్థితిలోనూ వాటిని అనుమతించవద్దని సొసైటీలు సూచించాయి. ఉదయం వండిన అన్నం మధ్యాహ్నం.. మధ్యాహ్నం వండిన ఆహారాన్ని సాయంత్రానికి వడ్డించినట్లు వెల్లడైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. విద్యార్థులకు వేడివేడిగా ఉండే టిఫిన్, భోజనమే అందించాలని తెలిపాయి. వడ్డించేందుకు రెండు నుంచి మూడు గంటల ముందే వంట చేయాలని వివరించాయి. రాత్రికి 6 నుంచి 7 గంటల మధ్య వేడి ఆహారం వడ్డించి పూర్తి చేయాలని సూచించాయి.
ఇతర సూచనలు ఇవే
- రోజు లేదా రెండురోజులకోసారైనా వసతి గృహాల ప్రత్యేక అధికారులు గురకులాలు, వసతిగృహాల్లో ఆహార వస్తువుల నిల్వ, వంటపై తనిఖీ చేయాలి.
- గురకులాల్లో, వసతిగృహాల్లో విద్యార్థుల మెస్ కమిటీలు ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలోనే మెనూ నిర్ణయించాలి.
- విద్యార్థులు ఏమైన ఫిర్యాదు చేయడానికి తప్పనిసరిగా ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలి. పిల్లల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలి.
- ఆహారం నిల్వలకు అవసరమైన సామగ్రి, డబ్బాలు లేకపోతే వెంటనే ప్రతిపాదనలు పంపించాలి.
- గుత్తేదారుల నుంచి వచ్చిన పప్పుదినుసులపై ఐఎస్ఐ మార్కును పరిశీలించాలి. అంతేకాకుండా సరకులు నిల్వ చేసే గదిలో ఎలాంటి ఫంగస్, పురుగులు, ఎలుకలు రాకుండా చూసుకోవాలి. పౌరసరఫరాల శాఖ నుంచి అందిన బియ్యాన్ని సైతం పరిశీలించాలి.
- వంట చేసే మనుషులు నిపుణులై ఉండాలి. వంట చేసేటప్పుడు వంట సిబ్బంది క్యాప్, ఆఫ్రాన్ ధరించాలి.
- టైం టేబుల్ ప్రకారం భోజనం వడ్డించాలి. విద్యార్థులతో కలిసే అక్కడి ప్రిన్సిపల్, వార్డెన్ భోజనం చేయాలి.
వసతిగృహాల్లో ఘటనలపై సీఎం సీరియస్ - బాధ్యులపై వేటు వేయాలని ఆదేశాలు
పిల్లలు చనిపోతే కానీ స్పందించరా ? - మాగనూర్ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం