Wedding Season Started In November 2024 : 3 నెలల మూడాలు ముగిసి శుభకార్యాలకు తెర తొలిగే రోజులు దగ్గరపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాభజంత్రీలతో సహా బరాత్‌ల మోత మోగనుంది. మరో మూడు మాసాలు శుభ ముహూర్తాలు ఉన్నాయని, యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయ పూజారులు, పంచాంగకర్తలు, బ్రాహ్మణ పూజారులు చెబుతున్నారు. దీంతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే క్రతువులు అంటే పెళ్లి చూపులు, మాటాముచ్చట్లు ముమ్మర మయ్యాయి. వచ్చే నెల 3 నుంచి శుభ ముహూర్తాలు మొదలై, 20 వరకు 12 శుభముహూర్తాలున్నట్లుగా పండితులు చెబుతున్నారు.
శుభముహూర్తాలు ఇవే : కార్తీక మాసం దీపావళి పర్వదినం సంబరాలయ్యాక నవంబరు(కార్తీక మాసం)లో 3వ తేదీ. 7న ఉదయం సమయం, రాత్రి, 8వ తేదీ ఉదయం, 10వ తేదీ ఉదయం సమయం, రాత్రి, 13వ తేదీ ఉదయం 14న ఉదయం, 17న మూడు పూటలు, ఇక 20వ తేదీన ఉదయం మంచి ముహూర్తాలున్నాయి.
డిసెంబరు, జనవరి నెలల్లో శుభముహూర్తాలు : డిసెంబరు(మార్గశిరం) నెలలో 4, 5, 6, 11, 20, 25 తేదీల్లో వివాహ బంధాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మాఘ మాసంలో వచ్చే ఏడాది జనవరి (మాఘమాసం)లో 31న ఉదయం సమయంలో, రాత్రి రెండు శుభ ముహూర్తాలున్నాయి.
ఫిబ్రవరి నెలలో : ఫిబ్రవరి 2, 7 తేదీల్లో ఉదయం, రాత్రి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 13న ఉదయం, 14వ తేదీ రాత్రి, 16 వ తేదీన మూడు వేళల్లో ముహూర్తాలున్నాయి. 20వ తేదీ రెండు, 22, 23 తేదీల్లో రెండేసి ముహూర్తాలున్నాయి. ఫాల్గుణంలో వచ్చే మార్చి 2వ తేదీన ఉదయం రెండు, రాత్రి రెండు శుభ ముహూర్తాలున్నాయి. 6వ తేదీన 3 వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నట్లు పంచాంగకర్తలు, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య, విశ్రాంత పురోహితులు బుచ్చయ్యశర్మ వెల్లడించారు.
రూ.625 కోట్ల వ్యాపారం : మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలవనున్న సందర్భంగా రాష్ట్రంలో రూ.625కోట్ల రూపాయల వ్యాపారం జరగనుందని అంచనా వేస్తున్నారు. 5 వేల జంటలు ఒక్కటి కానున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తన సర్వేలో వెల్లడించింది.