Heavy Rains to Hit Telangana in Next 24 Hours : తూర్పు-మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో గురువారం(రేపు) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 30 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ జిల్లాల్లోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
భారీ నుంచి అతిభారీ వర్షాలు కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. ఈనెల 31 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకటో తేదీన భారీ నుంచి అతిభారీ వర్షాలు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్లోని జీడిమెట్లలో వర్షం : ఇవాళ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జీడిమెట్ల, షాపూర్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం వేడిగా ఉండడం ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ ప్రాంత వాసులు సేదతీరారు.