Heavy Rain Alert in Telangana : రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.
రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ : దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ములుగు, భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కుమురంభీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందు వల్ల అందరూ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ తెలిపింది.
'వర్షాన్ని లెక్కచేయకుండా వాగులు, వంకలు దాటుతూ వైద్య సేవలు' - Medical Services in mulugu
Telangana Heavy Rains Today : ఈ నెల 20వ తేదీన శనివారం రోజు ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న- సిరిసిల్ల, జయశంకర్ - భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.
ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లోలెవల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని అప్రమత్తం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని భారీ వర్షాలు కురిసేటప్పుడు ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు.