Influenza Virus In Telangana : రాష్ట్రంలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరోగ్య శాఖ పలు సూచనలు జారీ చేసింది. చలి ఎక్కువగా ఉండే సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది. ఇది సాధారణ వ్యాధి అని, కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుందని తెలియజేసింది. గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత రోగులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలిగాలికి తిరగడం, అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. సరైన నిద్ర, సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లూయెంజా బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు.
ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో వైద్యుల సలహాలు :
- వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.
- చలి ఎక్కువ ఉండే సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఇలా చేస్తేనే మంచిది.
- వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి.
- చిన్న పిల్లలు, వృద్ధులు వేడి పానీయాలు తీసుకోవాలి.
- ముదురు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.
- అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉంటే మంచిది.
- సరైన నిద్ర, తిండి, ఎక్కువ నీరు తాగాలి.
- వృద్ధులు, చిన్నపిల్లలు చలి ఎక్కువగా ఉండే రాత్రి సమయాల్లో బయటకు రాకూడదు.
Intensity of Cold has Increased : తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో అతి తక్కువగా 3.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత 1973లో నమోదు కాగా, 2023లో వికారాబాద్ జిల్లా గండీడ్‌లో 3.5 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా నమోదవుతోంది. రాష్ట్రంలో సగటు చలికాల ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ కాగా, కొన్నేళ్లుగా దీని కన్నా తక్కువ స్థాయిలో సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
అలర్ట్ - పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
తెల్లవారుజామున గజగజ, రాత్రిళ్లు ఉక్కపోత - ఈ ఏడాది చలికాలం వెరీ డిఫరెంట్!