Minister Tummala Statement on Loan Waiver : రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణమాఫీపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన వివరాలు చెబుతున్నప్పటికీ, బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళపరిచి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
'రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు కాగా, వీరిలో భూములు ఉండి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 42 లక్షలు. బీఆర్స్ ప్రభుత్వంలోని 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే. అప్పట్లో కనీసం 20 లక్షల మందికి కూడా సరిగా మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు 42 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయి. రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకొని, కుటుంబ నిర్ధారణ అయిన ఖాతాల సంఖ్య 22,37,848. వీరికి ఇప్పటికే రూ.17,933.19 కోట్లను మొదటి పంట కాలంలోనే మాఫీ చేశాం. మిగతా 20 లక్షల మందికీ రుణమాఫీ చేస్తాం.
ఈ లెక్కల్లో బీజేపీ నేతలకు అనుమానాలుంటే బ్యాంకుల వారీగా వివరాలు తీసుకోవచ్చు. ఇంత పారదర్శకంగా లెక్కలున్నప్పటికీ రుణమాఫీ 2024 పథకం పూర్తయిందని మేం ప్రకటించామంటూ బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పి, తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. నాకు మంత్రి పదవి కొత్త కాదు, ఇతర పదవులకు ఆశపడో మాట్లాడే నైజం నాది కాదు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకులు నా గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
రూ.10 వేల కోట్లు కోరితే కేవలం రూ.400 కోట్లే కేటాయించారు : గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.10 వేల కోట్ల సాయం కోరితే రూ.400 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 37 లక్షల నుంచి 30 లక్షలకు తగ్గించి రైతులకు అన్యాయం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే దొడ్డు రకం రేషన్ బియ్యం దుర్వినియోగమవుతోంది. దీన్ని అరికట్టడానికి, మా ప్రభుత్వం మీద రూ.2,000 కోట్ల అదనపు భారం పడినా వెనక్కి తగ్గకుండా సన్నబియ్యం సేకరించి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్‌కార్డు దారులకు, అన్ని వసతి గృహాలకు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించాం.' అని మంత్రి వివరించారు.
రైతు రుణమాఫీపై రాజకీయ నేతల మాటలయుద్ధం - ప్రతిపక్షానికి మంత్రుల కౌంటర్ - Telangana crop loan 2024