Water Crisis In SRSP Canal : కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిరంతరం ఎస్సారెస్పీ వరద కాలువలో నీరు నిల్వ ఉండే విధంగా గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ మేడిగడ్డ పియర్లు కుంగిపోవడంతో పరిస్థితి తల కిందులైంది. నీరు ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద కాల్వపై ఆధారపడి పంటలు వేసిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలు లేకపోయినా వరదకాల్వపై ఆధారపడిన రైతులకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినా అది కాస్తా అర్దాంతరంగా నిలిచిపోవడంతో రైతులు యాసంగి పంటకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. నిరంతరం వరద కాల్వలో నీరు నిల్వ ఉండే విధంగా అటు కాలేశ్వరం ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చే విధంగా గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఇది కాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు గగ్గోలు పెడుతున్నారు.
Water scarcity for Crops in Karimnagar : మహారాష్ట్ర నిర్మించి బాబ్లీ ప్రాజెక్టు సహా వివిధ కారణాలతో శ్రీరాంసాగర్ వరద కాలువకు మిగులు జలాలు రావడం గగనమైంది. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీరు సమృద్ధిగా లభించింది. అప్పటి నుంచి వరద కాల్వ సమీప గ్రామాల రైతులు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేక, కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు ఆగిపోయి అన్నదాతల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
చివరి ఆయకట్టుకు నీరందేనా.. వేసిన పంట గట్టెక్కేనా..!!
Water Crisis In Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రధాన వనరుగా మారిన ఎస్సారెస్పీ వరద కాలువ నీరు లేక ఖాళీగా ఉండటంతో సమీప గ్రామాల రైతులకు యాసంగి పంటకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఈసారి కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, జగిత్యాల జిల్లా మల్యాల మండలాల్లో పొట్టకొచ్చిన వరి పంటకు సాగునీరు అందక రంగు వెలిసిపోతోంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి : పంట భూములకు సుమారు 15 మీటర్ల లోతున ఉన్న వరద కాల్వ మూలంగా భూగర్భ జలాల మట్టం అడుగంటి పోయింది. దీనివల్ల రైతులకు ప్రస్తుతమున్న వ్యవసాయ బావుల ద్వారా కూడా సాగునీరు అందించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 15 రోజులైతే పంట చేతికొస్తుందని గ్రావిటీ కాలువలో నిల్వ చేసిన నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించు కోవడంలేదని ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
''ఎస్సారెస్పీ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో కూడా నీరు అడుగంటి పోయాయి. అప్పులు తెచ్చి పంట పొలాలపై పెట్టుబడి పెట్టాము. 15 రోజులైతే పంట చేతికొస్తుంది. ఇప్పుడు నీరు లేకపోతే పంటలు అన్ని ఎండిపోతాయి. అధికారులకు మా భాదను చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.'' - రైతులు
అడుగంటిన బోర్లు - ఎండుతున్న పైర్లు - ఎండ తాకిడికే నెర్రెలు వారుతున్న భూతల్లి
సాగర్ ఆయకట్టులో కరవు ఛాయలు - సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు - Water scarcity for Crops