Five Panchabhuta Lingams Visit : పంచ భూతాత్మక లింగాలు దక్షిణ భారతంలోనే దర్శనీయ ప్రాంతాలుగా అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా ప్రముఖంగా పేరొందాయి. వీటిలో తెలుగు ప్రాంతంలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంగా ప్రశస్తి పొందింది. అగ్ని, పృథ్వీ, ఆకాశ, జల లింగాలుగా ఉన్న నాలుగు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఈ దేవాలయాలన్నింటినీ దర్శించుకునే అవకాశం ఉమ్మడి కడప జిల్లా వాసులకు ఉంది.
కార్తిక మాసంలో ఆధ్యాత్మిక, పర్యాటక ఆనందాన్ని పొందాలంటే మీకు వీలైన సమయాల్లో ఆయా క్షేత్రాల దర్శనానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి మరి. వారాంతపు రైళ్లు కావడంతో రిజర్వేషన్ కూడా సులభంగా దొరుకుతుంది.
అరుణాచలం(అగ్ని లింగం) : దేశంలో శైవక్షేత్రాల్లో ప్రముఖమైంది అరుణాచలం ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. అక్కడకు వెళ్లడానికి కడప నుంచి నేరుగా ఓకా-మధురై వారంతపు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. తిరుగు ప్రయాణంలో నచ్చిన వెసులుబాటును బట్టి కడపకు రావచ్చు. దీంతో పాటు అహ్మదాబాద్-తిరుచ్చి, లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్, ముంబయి-కరైకల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ముంబయి - నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు కడప నుంచి విల్లుపురానికి వెళతాయి. అక్కడ నుంచి రైలు, బస్సు మార్గాల్లో అరుణాచలానికి సులభంగా చేరుకోవచ్చు.
చిదంబరం కోవెల(ఆకాశ లింగం) : చిదంబరం నటరాజ స్వామి కోవెలను దర్శించుకునేందుకు కార్తిక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఇక్కడికి వెళ్లడానికి కడప నుంచి అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి , లోకమాన్యతిలక్ - కరైకల్ రైళ్లు నేరుగా చిదంబరం వెళతాయి. అలాగే కడప నుంచి విల్లుపురం వెళితే అక్కడి నుంచి బస్సు, రైలు మార్గాల ద్వారా కూడా చిదంబరం చేరుకోవచ్చు.
జంబుకేశ్వరం(జల లింగం): తిరుచిరాపల్లికు 11 కి.మీ. దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. కడప నుంచి తిరుచిరాపల్లికి 22101, 16351, 09419, 09520, 16353 నెంబర్లు గల రైళ్లలో వెళ్లొచ్చు. అటు నుంచి నేరుగా కడపకు రైళ్లు ఉన్నాయి.
కంచి ఆలయం(పృథ్వీ లింగం) : కంచి ఏకాంబరేశ్వర ఆలయాన్ని పృథ్వీ లింగంగా భక్తులు కొలుస్తారు. దేవాలయాల పట్టణంగా పేరొందిన కంచి దక్షిణాదిలో అత్యంత పవిత్రమైన క్షేత్రం. తమిళనాడులోని ఈ ఆలయానికి రైలు ప్రయాణం ద్వారా నేరుగా కడప నుంచి చేరుకోవచ్చు. కార్తిక మాసంలో ఏ రోజు ఈ క్షేత్రాలను దర్శించుకున్నా పుణ్యమేనని పూజారులు చెబుతున్నారు.
శ్రీకాళహస్తి(వాయులింగం) : పంచభూత లింగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. ఇక్కడి శివలింగాన్ని వాయులింగంగా కొలుస్తారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాళహస్తికి నేరుగా రైలు వెళుతుంది. అలాగే రేణిగుంటకు రైళ్లలో వెళ్లి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు. రేణిగుంట రైలు నిలయం నుంచి ఎక్కువ రైళ్లు ఉన్నాయి. రేణిగుంటకు సమీప దూరంలోనే కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది.
ఇతర సదుపాయాలు : పంచభూత లింగాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు తమ రిజర్వేషన్ టిక్కెట్ ద్వారా ఆయా రైల్వేస్టేషన్ల డార్మెటరీల్లో వసతిని పొందవచ్చు. వీటితో పాటు తమిళనాడు పర్యాటక శాఖ, ప్రైవేటు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.7వందల నుంచి రూ.2వేల వరకు బడ్జెట్లో హోటళ్లు ఉన్నాయి. ముందుగా ఆయా హోటళ్లలో వసతి గదులను బుక్ చేసుకునే వసతి కూడా ఉంది.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
కార్తిక మాసంలో ప్రముఖంగా పేరున్న శివాలయాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. అరుణాచలం, చిదంబరం, తిరుచినాపల్లి, కంచి, శ్రీకాళహస్తికి వెళ్లి పంచభూత లింగాలను దర్శించుకునేందుకు నేరుగా కొన్ని రైళ్లు అందుబాటులో ఉండగా, మరికొన్ని కనెక్టివిటీ రైళ్లు కూడా ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలి.
- జనార్దన్, కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టరు
భక్తులకు అదిరిపోయే శుభవార్త - కార్తికమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీస్
కార్తికమాసం స్పెషల్ - హైదరాబాద్ to అరుణాచలం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!