Seasonal Diseases in AP : ఏపీలో రోజురోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల విష జర్వాలు ప్రబలుతున్నాయి. దీంతో దగ్గు, జ్వరం జలుబులతో వచ్చేవారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కానీ ప్రస్తుతం విజృంభిస్తున్న జ్వరాలు వైద్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా జ్వరం వస్తే వాటి లక్షణాల ఆధారంగా అది ఏ రకమో డాక్టర్లు ఒక అంచనా వేస్తారు.
Seasonal Diseases Rise in AP : అదే జ్వరంతోపాటు కీళ్ల నొప్పులుంటే డెంగీ శరీరంపై దద్దుర్లుంటే గన్యా, తీవ్రమైన జ్వరమైతే టైఫాయిడ్, మలేరియా అని ప్రాథమికంగా భావిస్తారు. కొద్దిరోజులుగా జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు వైద్యులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డయాగ్నస్టిక్ సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా, వ్యాధి కారక వైరస్ ఏంటనేది తెలియరాలేదు. శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపడంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.
నిర్లక్ష్యం వద్దు : గతంలో వచ్చిన వైరల్ జ్వరాలకు మందులు వేసుకున్నా లేకున్నా 3 నుంచి 4 రోజుల్లో తగ్గిపోయేవి. ప్రస్తుతం వస్తున్న జ్వరాల ప్రభావం కనీసం 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజే శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుతుంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రతను చూపే సీఆర్పీ (సీ రియాక్టివ్ ప్రొటీన్) త్వరగా పెరిగిపోతోంది. ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతోంది. వీటిని నిర్లక్ష్యం చేయరాదని, వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
ఇవే లక్షణాలు :
- వికారం
- నీళ్ల విరేచనాలు
- కీళ్ల నొప్పులు
- నీరసం
- దగ్గు
- గొంతు నొప్పి
- కళ్ల మంటలు
- ముక్కు కారడం
- శరీరంపై దద్దుర్లు
అందరిపైనా ప్రభావం : పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాల్లో ఎక్కువగా ఏసీ గదులు కావడంతో ఈ జ్వరాలు త్వరగా వ్యాపిస్తున్నాయి. శ్రావణమాసం కావడంతో పూజలు, వేడుకలు, షాపింగ్ మాల్స్‌లో ఎక్కువగా గుమిగూడటంతో వ్యాప్తి ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీటి బారిన పడుతున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా ఇబ్బందికి గురవుతున్నారు. గతంలో కరోనా బారిన పడినవారిలో తీవ్రత ఎక్కువగా ఉంది.
ఎక్కడ చూసినా : విశాఖ జిల్లాలోని కేజీహెచ్, విమ్స్, యూపీహెచ్‌సీలు, ప్రైవేట్ క్లినిక్‌లు ఇలా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చాలా మంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ నెల 1 నుంచి 20 వరకు కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగంలో ఓపీ 2632గా ఉన్నారు. వారిలో 787 మంది రెండోసారి వచ్చినవారే. విమ్స్‌లో జనరల్ మెడిసిన్ ఓపీ పది శాతం పెరిగింది. విమ్స్‌లో ఇటీవల ఇన్‌పేషెంట్లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
భయాందోళన వద్దు: జ్వరాలపై భయాందోళన అవసరం లేదని ఏఎంసీ విశ్రాంత ఆచార్యులు డా.వి. రామ నరసింహం తెలిపారు . జ్వరం తగ్గినా కీళ్ల నొప్పులు 10 నుంచి 15 రోజులు ఉంటాయని చెప్పారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. చల్లని పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా సమయంలో తీసుకున్న ముందు జాగ్రత్తలన్నీ ఇప్పుడు పాటించాలని వివరించారు. చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని సామాజిక దూరం పాటించాలని అన్నారు. శానిటైజేషన్ చేసుకోవాలని జ్వర పీడితులు వాడిన టవల్స్, సబ్బు, వస్తువులు ఇతరులు వాడకూడదని డా.వి. రామ నరసింహం వెల్లడించారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు - ఉక్కిరి బిక్కిరవుతున్న గ్రామస్థులు - Dengue cases are rising